తెలంగాణ‌లో కిక్ ఇస్తోన్న మ‌ద్యం రేట్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ప్ర‌భుత్వం పెంచిన మ‌ద్యం రేట్లు నిన్నటి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. అయితే ఈ రేట్లు వింటేనే కిక్కు వ‌చ్చేలా ఉన్నాయి. మ‌ద్యం అమ్మ‌కాల‌ను త‌గ్గించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుని అందుకు త‌గిన విధంగా రేట్లు పెంచితే సామాన్యులు బార్ షాపుల వైపు వెళ్ల‌ర‌ని గ్ర‌హించింది. అందుకు త‌గిన విధంగా రేట్లు పెంచేసింది. ఈ పెరిగిన రేట్ల‌తో మ‌ద్యం అమ్మ‌కాలు త‌గ్గుతాయో లేదో తెలియ‌దు కానీ.. సామాన్యుడి జేబుకు చిల్లు ప‌డ‌టం ఖాయ‌మ‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు. ఈ పెంచిన రేట్లు అంతా ఇంతాకాదు.. భారీ మొత్తంలో రేట్లు పెంచ‌డంతో మ‌ద్యం ప్రియులు ఢిలా ప‌డిపోతున్నారు.




ఈ పెరిగిన రేట్ల‌తో చుక్క కొనేదెట్టా.. కిక్కు ఎక్కెదెట్టా అని దిగాలు ప‌డిపోతున్నారు మ‌ద్యం ప్రియులు. ఇప్పుడు పెంచిన రేట్లు చూస్తే క‌ళ్ళు బైర్లు క‌మ్మ‌డం ఖాయం. మ‌ద్యం ముట్టుకోకుండానే.. రేట్ల‌తోనే కిక్కు వ‌స్తుంద‌ని మ‌ద్యం ప్రియులు వాపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఈ పెంచిన రేట్లు మ‌రో రెండ్లు ఏండ్ల‌కు మ‌రింత పెంచుతామ‌ని ప్ర‌భుత్వం ముందుగానే ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు పెరిగిన రేట్ల‌తో అటు సామాన్యులే కాదు.. మ‌ద్య‌త‌ర‌గ‌తి.. ఉన్న‌త త‌ర‌గ‌తి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు ఇబ్బందిక‌రంగానే ఉంది. చీప్ లిక్క‌ర్ నుంచి చ‌ల్ల‌టి బీరు వ‌ర‌కు.. విస్కీ నుంచి వోడ్కా.. స్కాచ్ వ‌ర‌కు రేట్లు ఆకాశాన్ని అంటాయి.

ఈ రేట్ల‌ను ప్ర‌భుత్వం చాలా తెలివిగా అద‌న‌పు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ) పేరు చెప్పి అమాంతం పెంచేశారు. ఇదివరకు రూ.100కు దొరికే క్వార్టర్‌ సీసా కోసం ఇప్పుడు రూ.120 ఇచ్చుకోవాల్సి ఉంటుంది. హాఫ్‌బాటిల్‌ రూ.40.. ఫుల్‌ బాటిల్‌ రూ.80 మేర పెరిగాయి! బడాబాబులు తాగే బ్లాక్‌డాగ్‌, హండ్రెడ్‌ పైపర్‌, టీచర్స్‌ వంటి ఫుల్‌ బాటిల్‌ స్కాచ్‌రేట్లు రూ.150 దాకా పెరిగాయి. లైట్‌ బీరు రూ.20 చొప్పున.. స్ట్రాంగ్‌ బీరు రూ.10 చొప్పున పెరిగాయి. అంటే, ఇప్పటిదాకా రూ.100కు దొరికిన కింగ్‌ఫిషర్‌ లైట్‌ బీరు కోసం రూ.120 ఇచ్చుకోవాలి. అలాగే రూ.120కి దొరికే కేఎఫ్‌ స్ట్రాంగ్‌ బీరు కోసం రూ.130 ఇవ్వాల్సిందే. 90 ఎంఎల్‌ నిబ్‌పై రూ.10 చొప్పున పెరిగింది. కింగ్‌ ఫిషర్‌(ఆల్ట్రా) ధర రూ.150 ఉండగా… దానిని రూ.180కు పెంచింది.

సాధారణంగా మద్యం లైసెన్సు ఫీజులు కాకుండా వ్యాట్‌ను, ఎక్సైజ్‌ డ్యూటీని ఎక్సైజ్‌ శాఖ వసూలు చేస్తుంది. ఇలా అద‌న‌పు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రేట్ల‌ను అమాంతం పెంచేసి.. అది మంగ‌ళ‌వారం నుంచే అమ‌ల్లోకి తేవ‌డంతో మ‌ద్యం ప్రియులు గ‌గ్గొలు పెడుతున్నారు. పెంచిన ధ‌ర‌ల‌తో నెల‌కు దాదాపు మ‌ద్యం ప్రియుల‌పై రూ.300కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంది. అంటే ఏడాదికి మ‌ద్యం రూ.3600కోట్ల భారం ప‌డుతుంద‌న్న మాట‌. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే పెంచిన ధ‌ర‌ఖాస్తు ఫీజుల‌తోనే దాదాపు రూ.950కోట్ల ఆదాయం స‌ముపార్జించింది. ఇక ఏటా లైసెన్స్ పేరిట దాదాపు అన్ని ట్యాక్స్‌లు క‌లుపుకుని రూ.26కోట్ల వ‌ర‌కు ఆదాయం రాబ‌డుతుంద‌ని అంచనా. ఏదేమైనా మ‌ద్యం రేట్ల పెంపుతో సామాన్య జ‌నంపై భారీగా భారం ప‌డుతుంద‌నేది మ‌ద్యం ప్రియుల ఆవేద‌న‌.

Share.