వాట్సాప్‌పై ‘పెగాసస్ మాల్‌వేర్’ ఎటాక్…. అన్ఇన్‌స్టాల్ చేసిన యూజ్ లేదా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై ‘పెగాసస్ మాల్‌వేర్’ ఎటాక్ జరగడంపై యూజర్లు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన ఈ స్పైవేర్ తో.. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో వీఐపీల ప్రొఫైల్స్‌ని హ్యాకర్లు టార్గెట్ చేశారు. అయితే మన భారతదేశంలో 40 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు.

అసలు ఆ స్పైవేర్ ఎలా ఎటాక్ చేసిందంటే…..వాట్సాప్ యాప్‌లోని వీడియో కాలింగ్ ఫీచర్‌లో ఉన్న ఒక లోపం యూజర్ ప్రమేయం లేకుండానే స్పైవేర్ చొరబడేందుకు వీలు కల్పించింది. దానికి తోడు ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న లోపాల కారణంగానే ఆ స్పైవేర్ ఫోన్‌ను తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే ఆండ్రాయిడ్, యాపిల్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనైనా లోపాలు ఉంటే ఆ స్పైవేర్ ఎటాక్ చేస్తుంది.

ఇక మీ ఫోన్ లో స్పైవేర్ ఉన్నట్లయితే… అది యూజర్ల మెసేజెస్, మెయిల్స్ చెక్ చేయడం దగ్గర్నుంచి కాల్స్ వినడం వరకు పూర్తిగా నిఘా పెడుతుంది. అంతేకాదు… మీ బ్రౌజర్ హిస్టరీని చెక్ చేస్తూ మీ డిజిటల్ లైఫ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌కు తెచ్చుకుంటుంది. పైగా ఎన్‌క్రిప్టెడ్ వర్షన్‌లో ఉన్న ఆడియోఫైల్స్, టెక్స్ట్‌ ఫైల్స్‌ని కూడా యాక్సెస్ చేయగలదు. అంటే వాట్సాప్ కూడా.

ఈ స్పైవేర్ అనేది మీ ఫోన్ లో ఉంటే…మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసి వేరే వారి చేతికి అందించినట్లే అవుతుంది. ఈ క్రమంలోనే యూజర్లు వాట్సాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేసి దాని స్థానంలో వేరే యాప్ ని ఇన్-స్టాల్ చేసుకోవాలని చూస్తున్నారు. సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల వైపు చూస్తున్నారు. వాటిలో మరింత సురక్షితమైన ఎన్‌స్క్రిప్షన్ ఉందని చెప్తున్నారు. కానీ నిపుణుల మాత్రం పెగాసస్ కు ఏ యాప్ అయిన ఒకటే అని అంటున్నారు.

అయితే వాట్సాప్ డిలీట్ చేసి కొత్త యాప్‌ను ఉపయోగించటం వల్ల మన ఫోన్‌కు స్పైవేర్ దాడి నుంచి రక్షణ లభిస్తుందా? అంటే గ్యారెంటీగా చెప్పలేమంటున్నారు. కాకపోతే మిగతా వాటితో పోలిస్తే ఇప్పుడు వాట్సాప్ తో రక్షణ తక్కువగానే ఉందని అంటున్నారు. మొత్తానికి పెగాసస్ దాడికి గురైన ఫోన్లలో.. వాట్సాప్ మాత్రమే కాదు ఆ ఫోన్లలో ఉన్న సమాచారం మొత్తం ప్రమాదంలో ఉన్నట్లే అని చెబుతున్నారు.

Share.