‘ ఆవిరి ‘ క‌లెక్ష‌న్లు ఘోరం…అయోమయంలో దిల్ రాజు..

Google+ Pinterest LinkedIn Tumblr +

విభిన్న కథలతో ఎక్కువగా హర్రర్ సినిమాలు తెరకెక్కిస్తారని దర్శకుడు రవిబాబుకు మంచి పేరు ఉంది. అనసూయ, అవును సీరిస్‌ సినిమాలతో ర‌విబాబు మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అలాంటి డైరెక్ట‌ర్ నుంచి గత కొద్ది సంవత్సరాలుగా ఘోరాతి ఘోరమైన సినిమాలు వస్తున్నాయి. అసలు ఈ సినిమాలు చేస్తోంది అల్లరి డైరెక్టర్ రవిబాబేనా ? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక కాస్తో కూస్తో రవిబాబుక ఉన్న ప‌రువును ఆయన తాజా చిత్రం ఆవిరి పాతాళానికి తొక్కేసింది.

పైగా ఈ సినిమాకు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అన్నీ తానై వ్యవహరించారు. తీరా సినిమా రిలీజయ్యాక తొలి రోజు తొలి షోకు కేవలం పది శాతం ఆక్యుపెన్సీ కూడా లేదు. ఆవిరి సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా అంతా బోరింగ్‌ సన్నివేశాలతో పెద్ద తలపోటుగా మారింది. మామూలుగా దిల్ రాజు సినిమా అంటేనే ప్రమోషన్లు ఎంత హైప్‌లో ఉంటాయో తెలిసిందే.

ఈ సినిమా విషయంలో ఆయనకు ముందే నమ్మకం లేకపోవడంతో ప్రమోషన్లు కూడా గాలికి వదిలేశారు. ఫస్ట్ వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం రు. 10 లక్షలు మాత్రమే వసూలు చేసిన ఆవిరి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రు. 25 లక్షలు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. రవిబాబు తీరు మార్చుకోక‌పోతే మ‌రో వ‌ర్మ‌లా మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌న్న సెటైర్లు ప‌డుతున్నాయ్‌.

Share.