ఈమధ్య సోషల్ మీడియాలో ‘ట్రెండింగ్’ హవా నడుస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా… పెద్ద హీరోల సినిమాల ప్రోమోలు రిలీజైనప్పుడు ఈ ట్రెండింగ్ హడావుడి పీక్స్‌లో వుంటుంది. తమ హీరో స్టామినా మరింత పెంచేందుకు అభిమానులు ఈ ట్రెండింగ్ జాతరను మరో ఎత్తుకు తీసుకుపోతున్నారు. ఎవరైనా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే… దాన్ని బ్రేక్ చేసేందుకు ఇతర హీరోల ఫ్యాన్స్ అంతకుమించి కసరత్తులు చేయడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే… వీళ్ళందరికీ ఇప్పుడు ‘2.0’ అసాధ్యమైన సవాల్ విసిరింది. ఇన్నాళ్ళూ దేశవ్యాప్తంగా వున్న ట్రెండింగ్ రికార్డ్‌ని ఈ టీజర్ విదేశాల స్థాయికి ఎగబాకేలా చేసింది.
అవును… ఈ టీజర్ ఒక్క భారత్‌లోనే కాదు, ఏకంగా 30 దేశాల్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ టీజర్… ఇప్పటివరకూ 24.8 మిలియన్ల డిజిటల్ వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా ప్రోమోలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. రానురాను ఇది పోస్ట్‌పోన్ అవుతూ రావడంతో జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతూ వచ్చింది. మొత్తానికి ఇన్నాళ్ళ తర్వాత జనాల ఆకలి తీరేలా అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో చాలా గ్రాండియర్‌గా ఈ టీజర్ వుండడంతో… నెటిజన్లు సోషల్ మీడియాపై ఎగబడ్డారు. అందుకే… అసాధ్యమైన వ్యూస్‌తో దూసుకెళ్తూ… ఏకంగా 30 దేశాల్లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.
బంగ్లాదేశ్, యుఏఈ, నేపాల్, ఖతార్ జపాన్, సింగపూర్, మలేషియా, హాంగ్ కాంగ్, చైనా, మాల్ దివ్స్, శ్రీ లంక, జకార్తా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఈ సినిమా టీజర్ అక్కడి యూట్యూబ్‌లలో పాపులర్‌గా నిలవడం… ఇండియన్స్‌కి గర్వకారణం! హాలీవుడ్ స్థాయిని ఎన్నడూ అందుకోదని విమర్శలు ఎదుర్కొన్న మన ఇండియన్ సినిమా… ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యచకితుల్ని రేంజ్‌కి వెళ్లింది. అందుకు కృషి చేస్తున్న శంకర్‌లాంటి దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!