టాలీవుడ్ లో చిన్న సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. కానీ కొంత కాలంగా మనోడి సినిమాలు ఏవీ పెద్దగా హిట్ కొట్టకపోవడంతో ఇక లాభం లేదని తన సొంత బ్యానర్ లో ‘ఛలో’ సినిమాతో వచ్చి మంచి విజయం అందుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ట్రెండ్ ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం నాగశౌర్యకు సరిగా బోధపడనట్టుంది..అందుకే మరోసారి తన సొంత బ్యానర్ లో ‘@నర్తనశాల’ అంటూ అభిమానుల ముందుకు వచ్చాడు.
ఈసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు. ఈ చిత్రం అత్యంత ఘోరమైన పరాజయం పాలవడంతో నాగశౌర్య షాక్ తిన్నాడు. ఛలో చిత్రానికి ఏదయితే చేసాడో దీనికి కూడా అదే చేసినా కానీ ఫలితం బెడిసి కొట్టింది. ఈ సినిమా బిజీలో తనతో ప్రాజెక్ట్ చేయడానికి వచ్చిన నలుగురు యువ దర్శకులని వెయిటింగ్లో వుంచాడు. అయితే నర్తనశాల విషయంలో నిర్మాతలైన నాగశౌర్య తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసినా కానీ తనకి నమ్మకం వుందంటూ వాళ్ల మాట లెక్క చేయలేదట.
అంతే కాదు ఓ ఈవెంట్ లో ఇష్టమైతే చూడండి..నచ్చితే పదిమందికి చెప్పండి..లేదంటే ఫ్లాప్ అని చెప్పండి అంటూ బహిరంగా భారీ డైలాగ్స్ కొట్టాడు. ఛలోకి ముందు సమయం తీసుకుని ఆ చిత్ర విజయానికి అన్నీ పక్కాగా సిద్ధం చేసుకున్న శౌర్య ‘నర్తనశాల’ విషయంలో కంగారు పడ్డాడు. అంతకు ముందు మనోడు నటించిన కణం, అమ్మమ్మగారిల్లు ఫెయిల్ కావండంతో కామెడీ జోనర్ లో ‘@నర్తనశాల’తో బాగా మెప్పించవొచ్చని ధీమాతో త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూశాడు. కానీ తానొకటి తలిస్తే..దైవం ఒకటి తలచినట్లు ‘@నర్తనశాల’ బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యింది.