మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం చిరు ఏ రేంజ్‌లో కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ మూవీలో చిరుతో పాటు చాలా మంది దిగ్గజ నటీనటులు నటిస్తున్నారు. కాగా చిరు తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలో నటీనటులను కూడా ఓకే చేస్తూ స్పీడు పెంచాడు కొరటాల. అయితే మెగాస్టార్ సినిమా కావడంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించిన కొరటాల టాలీవుడ్ స్వీటీ అనుష్కను హీరోయిన్‌గా అనుకున్నాడు. ఆమెను ఈ సినిమాలో నటించాల్సిందిగా కొరటాల అడిగాడట. చిరు సినిమా కావడంతో అనుష్క కూడా వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
భాగమతి సక్సెస్ తరువాత మరే ఇతర సినిమాను ఓకే చేయని అనుష్క ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన స్లిమ్ ఫిగర్‌ను చిరంజీవి లాంటి స్టార్ హీరో పక్కన చూపించేందుకు వెంటనే ఓకే చెప్పిందట ఈ బ్యూటీ. మొత్తానికి మెగాస్టార్ పక్కన హీరోయిన్ ఛాన్స్‌ను చేతులారా ఎవరు మిస్ చేసుకుంటారు అనే విషయాన్ని అనుష్క మరోసారి రుజువు చేసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.