టాలీవుడ్లో సంక్రాంతి క్రిస్మస్ నుంచే మొదలు కాబోతుంది. వచ్చేవారం నుంచి వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందుగా డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ – నాగ చైతన్య నటిస్తున్న వెంకీ మామ సినిమా థియేటర్లలోకి రానుంది. అప్పటి నుంచి సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వరుస సినిమాల పరంపరంలో ముందుగా వస్తోన్న వెంకీ మామపై భారీ అంచనాలు ఉన్నాయి.
నిజ జీవితంలో మేనమామ, అల్లుళ్లు అయిన వెంకటేష్ – నాగచైతన్య జంటగా నటిస్తోన్న ఈ సినిమా రు.33 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాత్రం వసూళ్లు రాబట్టాలంటే ఈ సినిమాకు కత్తిమీద సాములాంటిదే. సోలో రిలీజ్ కోసం సురేష్‌బాబు చాలా ప్రయత్నాలు చేసినా డేట్ దొరక్క చివరకు డిసెంబర్ 13న సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమా కొన్న బయ్యర్లకు పెద్ద టెన్షన్ పట్టుకుందట. ఎందుకంటే వెంకీ మామ వచ్చిన వారం రోజులకే మరుసటి వారమే మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు వస్తున్నాయి. బాలయ్య రూలర్, సాయిధరమ్ ప్రతిరోజు పండగే, సల్మాన్‌ఖాన్ దబాంగ్ 3. ఈ మూడు సినిమాలు వస్తే చాలా థియేటర్లు వెంకీ మామ ఖాళీ చేయకతప్పదు.
ఓ వైపు సురేష్‌బాబు తన థియేటర్ల అన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే వారానికే మూడు సినిమాలు వస్తుండడంతో చాలా థియేటర్లు వాళ్లకు ఇవ్వక తప్పదు. దీంతో ఇప్పుడు రు.33 కోట్ల బడ్జెట్ ఎలా రికవరీ అవుతుందా ? అన్న టెన్షన్ అటు సురేష్‌బాబుకు, ఇటు ఈ సినిమా బయ్యర్లకు ఉందట.