బాల్ టాంపరింగ్: అడ్డంగా బుక్కైన విండీస్ ఆటగాడు…

Google+ Pinterest LinkedIn Tumblr +

క్రికెట్ లో బాల్ టాంపరింగ్ వివాదాలు ఎక్కువైపోతున్నాయి. మ్యాచ్ గెలవడానికి క్రికెటర్లు అడ్డదారులు తొక్కుతూ టాంపరింగ్ కు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. కిందట ఏడాది ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు బాల్ టాంపరింగ్ కు పాల్పడి ఒక ఏడాది పాటు నిషేధాన్ని ఎదురుకున్న విషయం తెలిసిందే. అటు ఆసీస్ బౌలర్ బెన్‌క్రాప్ట్ కూడా 9 నెలలు పాటు నిషేధించబడ్డాడు.

ఇక ఇదే బాల్ టాంపరింగ్ వివాదంలో ఇప్పుడు ఒక విండీస్ ఆటగాడు చిక్కుకున్నాడు. తాజాగా ఇండియా వేదికగా ఆఫ్ఘనిస్తాన్-వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో వన్డే నవంబర్ 11న లక్నో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ బాల్ టాంపరింగ్ పడినట్లు వీడియోలు బయటకొచ్చాయి.

మ్యాచ్‌లో బంతిని అందుకున్న నికోలస్ పూరన్ దానిపై ఉన్న తేమని తుడిచే నెపంతో బాల్ టాంపరింగ్‌కి యత్నించినట్లు వీడియోలో స్పష్టంగా కనబడింది. బంతి సీమ్ వద్ద అతను తన గోటితో బలంగా పదే పదే రుద్దడం ద్వారా బాల్ టాంపరింగ్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ టాంపరింగ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా….వాటిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రస్తుతం పరిశీలిస్తోంది.

ఒకవేళ అతను బాల్ టాంపరింగ్‌కి పాల్పడినట్లు తేలితే, కనీసం ఏడాది నిషేధం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి పూరన్ పై ఐ‌సి‌సి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ? ఇదిలా ఉంటే అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని వెస్టిండీస్ 3-0తో క్లీన్‌స్వీస్ చేసేసింది. ఇక మూడు టీ20ల సిరీస్ కూడా లక్నోలో గురువారం నుంచి ప్రారంభంకానుంది.

Share.