సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోకి నచ్చిన కథ మరొక హీరోకి నచ్చాలన్నా రూలేమీ లేదు. ఇలా ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలను మరెంతో మంది హీరోలు చేసి అందులో కొంతమంది భారీ విజయాలను అందుకుంటే.. మరి కొంతమంది నష్టాలను చూసిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రానున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్టు లేకుండా వచ్చి అతి తక్కువ సమయంలోనే అంచలంచేలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలతో అభిమానులను అలరించి.. ఇటీవల లైగర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పొందాడు.
డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే విజయ్ హిట్టు కొట్టి తిరిగి ఫామ్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో నే దర్శకుల నుంచి వరుసగా కథలు వింటున్నాడని సమాచారం. ఇప్పుడు జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గౌతమ్ ఇదే కథను ముందుగా రామ్ చరణ్ కు వినిపించారట. అంతేకాదు స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సినిమా మొదలు పెట్టాలని కూడా అనుకున్నారట.
కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత తన మీద అంచనాలు పెరిగిపోవడంతో రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఈ కథను గౌతమ్ తిన్ననూరి రౌడీ హీరోకి వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మంచి ఫీల్ గుడ్ మూవీలా ఈ సినిమాను డిజైన్ చేస్తానని గౌతమ్ మాటిచ్చాడట. అంతేకాదు త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేయమని విజయ్ కూడా గౌతమ్ ను కోరినట్లు సమాచారం. మొత్తానికి వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ మొదలుపెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో విజయ్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.