టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఆయన 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ‘సంప్రదాయం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వేణుమాధవ్.
స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన వేణుమాధవ్ పవన్‌కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక వేణుమాధవ్ చిన్న వయస్సులోనే మృతి చెందడం దురదృష్టకరం. ఇక వేణు మాధవ్ మృతికి లివర్ సంబంధిత సమస్యలతో పాటు మూత్ర పిండాల వ్యాధే కారణం అని తెలుస్తోంది.
నాలుగేళ్లుగా లివర్ వ్యాధితో బాధపడుతోన్న ఆయనకు అనూహ్యంగా కిడ్నీల వ్యాధి కూడా సోకింది. దీంతో వేణు కొద్ది రోజులుగా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆరోగ్యం బాగా విషమించడంతో ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. దురదృష్టవశాత్తు ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.