సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. ఈరోజు వెండితెరపై మెరుస్తూ వరుస అవకాశాలు దక్కించుకునే ఎంతో మంది హీరోయిన్లు కొన్నాళ్ల తర్వాత కనిపించకుండా పోతారు. అయితే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్తును ముందుగానే నిర్మించుకున్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీకి దూరమైనా సరే ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఇకపోతే ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చాలామంది తమ జీవిత చరమాంకంలో దీనస్థితిలో బతికిన రోజులు మనం చూస్తూనే ఉన్నాం. అనాధలుగా కన్నుమూసిన వారు ఎంతోమంది.. అలాంటి వారిలో తమిళనాడులోని నాగపట్నం కు చెందిన నిషా నూర్ కూడా ఒకరు.
1980లో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె గ్లామర్ రోల్స్ చేస్తూ అప్పట్లోనే బికినీలో మెరిసింది. ఇక 90ల్లో మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా నటించిన ఈమెకు ఆ తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలేవి లభించలేదు. 1980 మొదలుకొని సుమారు 15 ఏళ్ల పాటు కెరియర్ ను సక్సెస్ఫుల్గా కొనసాగించిన ఈమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కొంతకాలం తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. సంపాదించిన డబ్బంతా ఆవిరి అయిపోయింది. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కుటుంబం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు.
ఆ సమయంలోనే నిషా పరిస్థితిని క్యాష్ చేసుకున్న ఒక నిర్మాత ఆమెను వ్యభిచార రొంపులోకి దించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ వ్యభిచార రొంపు నుంచి ఆమె బయటకు రాలేక ఇక డబ్బుల కోసం వ్యభిచారిగా మారిపోయిందట. ఇదంతా జరిగిన ఏడాది తర్వాత ఒకరోజు దర్గా బయట వీధిలో నిద్రిస్తూ కనిపించారు నిషా.. అయితే ఆమెను ఒక తమిళ ఎన్జీవో కాపాడి ఆశ్రయం కల్పించింది.. కానీ ఆమె ఒక సినిమా నటి అని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. దీనికి కారణం ఆమె అనారోగ్యంతో అస్తిపంజరం లాగా మారిపోవడమే అని చెప్పాలి. ఆ తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా ఆమెకు ఎయిడ్స్ ఉందని తేలింది. ఆఖరికి 2007లో హాస్పిటల్లోనే ఒక అనాధ లాగా కన్ను మూసింది నిషా.