Tammareddy Bharadwaj.. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో విషయాలలో స్పందిస్తూ మరింత వైరల్ గా మారారు. ఈ క్రమంలోనే చంద్రబాబు (Chandrababu) అరెస్టుపై స్పందిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)కు మద్దతుగా నిలుస్తున్నారు.అసలు విషయంలోకి వెళితే ఇటీవల టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా మూడు వారాలను పూర్తి చేసుకోబోతున్నారు. ఇక పోతే మరొకవైపు చంద్రబాబు అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై ప్రధాన ప్రతిపక్ష వర్గం అయిన తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు తప్పు పడుతూ ఉండగా .. మరొకవైపు అధికార పార్టీ వైసిపి మాత్రం చంద్రబాబు అరెస్టును సమర్థిస్తోంది. మరి కొంతమంది రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన అరెస్టుపై ఖండిస్తున్నారు. మరి కొంతమంది ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అని.. ఆయన స్పందిస్తారు అని చాలామంది ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఆయన మాత్రం ఇప్పటివరకు చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలకు దారి తీస్తోంది.
ఇదే విషయంపై ఇటీవల బాలయ్య కూడా స్పందించారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని మీడియా మిత్రులు బాలయ్యను ప్రశ్నించగా.. దానికి బాలయ్య సమాధానం ఇస్తూ.. ఎవరు స్పందించినా.. స్పందించకపోయినా తమ పని తాము చేసుకుంటూ పోతామని తెలిపారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై దర్శక -నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి?ఆ అవసరం ఏముంది? అంటూ ప్రశ్నించారు తమ్మారెడ్డి.
జూనియర్ ఎన్టీఆర్ ను మొదటి నుంచి నందమూరి, నారా కుటుంబాలు దూరం పెట్టాయి. ఆయనకు వచ్చిన మాస్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూసాయి. 2009 ఎన్నికలలో ఎన్టీఆర్ ను బాగా వాడుకొని ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదు. అంతేకాదు ఆ సమయంలో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అవ్వడానికి టిడిపినే కారణం అని తమ్మారెడ్డి తెలిపారు. ఇక 2014 ఎన్నికలలో కావాలనే పార్టీకి దూరంగా ఉంచారని.. ఎన్టీఆర్ ను కలుపుకోలేదని.. అప్పుడు ఎన్టీఆర్ వస్తే తమకు టిడిపిలో చోటు ఉండదనే అభద్రతా భావంతోనే ఆయనను పార్టీకి దూరం చేశారని తమ్మారెడ్డి తెలిపారు. ఇక చంద్రబాబు ఎన్టీఆర్ ను ఏ రోజు పట్టించుకోలేదు.. అలాంటప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు అంటూ తమ్మారెడ్డి తెలిపారు.