సినిమా: శ్రీనివాస కళ్యాణం
నటీనటులు: నితిన్, రాశి ఖన్నా, జయసుధ, ప్రకాష్ రాజ్ తదితరులు
నిర్మాత: దిల్ రాజు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
మ్యూజిక్: మిక్కీ జె మేయర్
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
యంగ్ హీరో నితిన్ అందాల భామ రాశి ఖన్నా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు మొదలుకుని టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:
చండీగఢ్‌లో డిజైనర్‌గా పనిచేస్తున్న వాసు(నితిన్) చిన్నప్పట్నుండి మన సంప్రదాయాలపై గౌరవం పెంచుకుంటాడు. ఈ క్రమంలో కాఫీ షాప్‌లో పనిచేస్తున్న అమ్మాయి(రాశి ఖన్నా)ను చూసి ప్రేమలో పడతాడు వాసు. డబ్బులంటే వ్యామోహం ఉండి సంప్రదాయాలపై అస్సలు నమ్మకం లేని కోటీశ్వరుడు ఆర్కే(ప్రకాష్ రాజ్) కూతురినే వాసు ప్రేమిస్తాడు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. దీంతో వీరి నిశ్చితార్థం ఆ తరువాత పెళ్లిని కూడా ఫిక్స్ చేస్తారు. పెళ్లికి సంబంధించిన విలువలను ప్రాముఖ్యతను కళ్లకు కట్టే విధంగా చూపిస్తూ ఈ చిత్ర కథ ముగుస్తుంది.
విశ్లేషణ:
‘శతమానం భవతి’ వంటి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో అదిరిపోయే సక్సెస్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి అదే ఫార్ములాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పెళ్లి, దాని ప్రాముఖ్యతను సంప్రదాయ బద్ధంగా చూపించాడు దర్శకుడు. తెలుగు సంప్రదాయ పెళ్లి గురించి జనాలకు అర్ధమయ్యే విధంగా దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దాడు. రెండు కుటుంబాలను ఒకటి చేసే పెళ్లి వేడుకను మనం ఎలా చూడాలని ఆశపడతామో అదే విధంగా ఈ సినిమాలో మనకు చూపించారు.
సంప్రదాయాలను ప్రేమించే కుర్రాడు వాటిని పెద్దగా పట్టించుకోని కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తీరు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రతి తెలుగు కుటుంబం చూడాల్సిన సినిమాగా నిలిచిపోతుంది. దర్శకుడు రాసుకున్న కథను ఏమాత్రం మార్చకుండా అలాగే తీయడంతో ఈ సినిమా మరింత అందంగా కనిపించింది. మొత్తంగా చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేసేందుకు ఎలాంటి అతికి పోలేదు చిత్ర యూనిట్. ఇదే ఈ సినిమాకు బలం అని చెప్పాలి.
నటీనటులు పర్ఫార్మెన్స్:
‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో నటించిన నటీనటులు తమ కెరీర్‌లో ఒక మంచి సినిమా చేశామనే అనుభూతిని పొందారు. వాసు పాత్రలో నితిన్ అద్భుతమైన నటన కనబరిచాడు. రాశి ఖన్నా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. జయసుధ, ప్రకాష్ రాజ్‌లు తమ పాత్రలకు ఇంచు కూడా తేడా రానివ్వలేదు. ఈ సినిమాలో చిన్న పాత్రకు సైతం నోటెడ్ నటీనటులను తీసుకోవడంతో స్క్రీన్ మొత్తం కలర్‌ఫుల్‌గా కనిపించింది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
శ్రీనివాస కళ్యాణం సినిమాతో దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ఒక సాధారణ కథకు అసాధారణ ఎమోషన్‌ను జోడించి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతం. ప్రతి ఒక్క పాత్రను ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా సతీష్ చాలా జాగ్రత్తపడ్డాడు. ఎక్కడా వేలెత్తి చూపించకుండా ఉండేలా సతీష్ తన సత్తా చాటుకోవడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పడతారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ప్రతి సీన్‌ను చాలా అందంగా చూపించాడు. మిక్కీ జె మేయర్ సంగీతం సూపర్. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు టైటిల్ సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలే దానికి నిదర్శనంగా నిలుస్తాయి.
చివరిగా:
శ్రీనివాస కళ్యాణం – కుటంబ సమేతంగా చూడాల్సిన చిత్రం!
రేటింగ్:
3.5/5