నాగ చైతన్య సవ్యసాచి రివ్యూ రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తారాగణం: అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమికా చావ్లా తదితరులు
దర్శకత్వం: చందూ ముండేటి
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: యువరాజ్
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్

సరైన హిట్టు కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న నాగచైతన్య సవ్యసాచి ద్వారా హిట్టు కొట్టి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఆ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మాస్ కు దగ్గరయ్యేందుకు చైతు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయా లేదా అన్నది ఈ సినిమాతో తేలిపోతుంది. వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే కొత్త కథతో చేసిన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది ఈ సినిమాతో తేలిపోనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ నిర్మాణ సంస్థగా అవతరించింది. అలాంటి పెద్ద బ్యానర్ నుంచి అక్కినేని నాగచైతన్య హీరోగా సినిమా వస్తోందనడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

‘కార్తికేయ’ లాంటి వైవిధ్య చిత్రాన్ని తెరకెక్కించిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో కూడా ఏదో కొత్తదనం ఉండే ఉంటుందని ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు.
ఇక ఈ సినిమా టైటిల్ ‘సవ్యసాచి’ అని డిఫ్రెంట్ గా పెట్టడంతో సినిమా కూడా అదే స్థాయిలో డిఫ్రెంట్గా ఉంటుందనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు.

కథ :
ప్రతీకారం తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ తో నిర్మించిన థ్రిల్లింగ్ డ్రామా ‘సవ్యసాచి’. అయితే దీనికి ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే అంశాన్ని చేర్చడం వల్ల కథకు కొత్తదనం వచ్చింది. తల్లి గర్భంలో ఏర్పడిన కవల పిండాలు పోషకాహార లోపం వల్ల ఒకటిగా కలిసిపోవడమే ఈ లోపం. ఇదే లోపంతో విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య) పుడతాడు. అయితే విక్రమ్ ఆదిత్య ఒకరు కాదు.. అతనిలో ఆదిత్య రెండో వ్యక్తి. అతను బయటికి కనిపించకపోయినా న్యూరాన్ల రూపంలో విక్రమ్ మెదడు, ఎడమ చేతిలో దాగి ఉంటాడు. అతనికి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని విక్రమ్ ఎడమచేతితో చూపిస్తుంటాడు.

అరుణ్ రాజ్(మాధవన్) ఎంతో మేధావి. కానీ అతన్ని ఎవరైనా విమర్శించినా, తను కావాలనుకున్నదాన్ని ఎవరైనా దూరం చేసినా తట్టుకోలేడు. వారిని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి వ్యక్తి విక్రమ్ ఆదిత్య కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. వాళ్లని అంతం చేయాలనుకుంటాడు. విక్రమ్ బావని చంపేస్తాడు. విక్రమ్‌తో అతని అక్క(భూమిక), పాపని కూడా చంపేయాలనుకుంటాడు. అసలు అరుణ్‌కు విక్రమ్ కుటుంబాన్ని చంపాల్సిన అవసరమేంటి? అరుణ్‌ను విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు? తన అక్క, మేనకోడలిని ఎలా కాపాడుకున్నాడు? అనే అనేక సస్పెన్సులతో ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :

వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ లక్షణాలను, దాని వలన తలెత్తే సమస్యల గురించి చర్చిస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది . సినిమా ఓపెనింగ్ ఎంతటి ఆసక్తిగా ఉంటుందో .. దానిని కంటిన్యూగా చూపించడంతో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఇదే సినిమాకు మైనస్ గా మారింది. ఒక్కరిలో ఇద్దరు ఉన్నారు అన్న కొత్త పాయింట్ మినహా మిగతా కొత్తగా ఏమిలేదు. పాత్రలను పరిచయం చేయడం, కాలేజీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. చైతన్య, వెన్నెల కిషోర్ చేసిన సందడి పర్వాలేదనిపించింది.
సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది. బాంబు పేలుడు తరువాత సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అక్క కూతురు కిడ్నాప్ అంశాలను ఛేదించే క్రమంలో విలన్ కు, హీరోకు మధ్య మైండ్ గేమ్ తరహా కథనం మొదలౌతుంది. ఇదే సినిమాకు ప్లస్ పాయింట్.

నటీనటుల పనితీరు :
హీరో నాగ చైతన్య, విలన్ రోల్ చేసిన మాధవన్ పాత్రలు ఆకట్టుకుంటాయి. నిధి అగర్వాల్ తెరపై అందంగా కనిపించింది. భూమిక చిన్న పాత్రే అయినప్పటికీ ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సత్య, శంకర్ పాత్రలు మెప్పించే ప్రయత్నం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం ఆకట్టుకుంది. కొత్త కథతో మెప్పించే ప్రయత్నం చేశాడు. కీరవాణి సంగీతం సినిమాపై మంచి ప్రభావం చూపింది. యువరాజ్ కెమెరా ఆకట్టుకుంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్: 3/5

Share.