ఒకప్పుడు తెలుగు సినిమాలంటే కేవలం ప్రాంతీయ సినిమాల్లానే ఉండేవి. కాని బాహుబలి తర్వాత పరిస్థితులు మారాయి. ఇక్కడ సినిమాల సత్తా ఏంటో దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తెలిశాయి. కేవలం పెద్ద సినిమాలకే కాదు చిన్న సినిమాలకు మార్కెట్ పెరిగిందని చెప్పొచ్చు. తెలుగులో హిట్టైన ప్రతి సినిమా మీద బాలీవుడ్ మేకర్స్ కన్ను ఉంటుంది. అందుకే రెండేళ్ల క్రితం హిట్టైన అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ సూపర్ హిట్ కొట్టారు.
మన దర్శకులు చేసే భారీ బడ్జెట్ సినిమాలు ఎలాగు హిందిలో కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే మినిమం బడ్జెట్ లేదా అంతకన్నా తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలు మాత్రం ఇక్కడ హిట్ అవడమే ఆలస్యం బాలీవుడ్ లో రీమేక్ రైట్స్ కొనేస్తున్నారు. అర్జున్ రెడ్డి అక్కడ కబీర్ సింగ్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో హీరోగా నటించిన షాహిద్ కపూర్ కు మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేలా చేసిన సినిమా కబీర్ సింగ్.
అందుకే ఈ హీరో ఇప్పుడు మరో సూపర్ హిట్ తెలుగు సినిమాపై కన్నేశాడు. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాను హిందిలో రీమేక్ చేస్తున్నాడు షాహిద్ కపూర్. తెలుగు దర్శకుడు గౌతం తిన్ననూరి ఈ సినిమాను హిందిలో డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. అల్లు అరవింద్, దిల్ రాజులతో పాటుగా మరో బాలీవుడ్ నిర్మాత ఈ సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నారట. మరి షాహిద్ కపూర్ జెర్సీ ఎలా ఉండబోతుందో చూడాలి.