ఇండస్ట్రీలో ఎవరికి అయినా రెమ్యూనరేషన్ అనేది ఎప్పుడూ డిమాండ్ మీదే ఆధారపడి ఉంటుంది. హీరోయిన్ల విషయంలో అది ఇంకా ఎక్కువ. మన తెలుగులో 60 ఏళ్ల హీరోలు కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంటారు. వారు కుర్ర హీరోయన్లతో రొమాన్స్ చేస్తుంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. హీరోయిన్లకు లాంగ్ రన్ ఉండదు. మహా అయితే 30-32 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్లకు ఛాన్సులు రావడం తగ్గిపోతుంటాయి.
అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరికి మాత్రమే కాస్త ఎక్కువ రన్ ఉంటుంది. ఇక ఇప్పుడు తెలుగులో పూజాహెగ్డేకు కాస్త ఎక్కువ డిమాండ్ ఉన్నట్టే కనిపిస్తోంది. పూజా హెగ్డే కెరీర్లో ఇంతవరకూ సాలిడ్ గా హిట్ అనేది లేదు. అయినా డిమాండ్ మాత్రం పీక్స్ లో ఉంది. మహేష్‌బాబు, వరుణ్‌తేజ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఆమెకు సోసో హిట్లే తప్ప బ్లాక్ బస్టర్ హిట్ అయితే లేదు.
తాజాగా ఆమె అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’.. ప్రభాస్ ‘జాన్’ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులే. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్‌గా రూ. 1.5 కోట్ల నుండి 2 కోట్ల వరకూ చార్జ్ చేస్తోందట. హీరోయిన్ల కొరత ఎక్కువుగా ఉండడంతోనే అందరూ హీరోలు ఆమె వెంట పడుతున్నారు. దీంతో ఆమె రేటు విషయంలో కొండెక్కి కూర్చుంటోందన్న కామెంట్లు పడుతున్నాయి.
శ్రియ.. కాజల్.. తమన్నా, అనుష్క ముదురు బ్యాచ్ అయిపోయారు. సమంతకు పెళ్లవ్వడంతో ఆమె లిమిట్స్‌లో ఉంటోంది. ఇప్పుడు కొత్త హీరోయిన్లలో రష్మిక తప్ప ఎవ్వరూ ఆకట్టుకునే వాళ్లు లేరు. అందుకే పూజ రేటు విషయంలో బాగా బెట్టు చేస్తోందంటున్నారు.