ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా యాడికి మండలం బోయిరెడ్డిపల్లి లో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ కోల్ మిల్ వెనుక భాగంలో ఒక్కసారిగా ఆదివారం మంటలు చెలరేగాయి. బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ఫ్యాక్టరీ లోని ఐదవ అంతస్తులో మంటలు చెలరేగాయి.
ఆ మంటలు దాదాపుగా 100 అడుగుల మేరకు మంటలు ఎగిసిపడ్డాయట. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు సంభవించిన సమయంలో కార్మికులు టీ బ్రేక్ కు బయటకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది అన్నట్టు గా సమాచారం. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు.
కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతోనే అగ్ని ప్రమాదం జరిగింది అని పలువురు ఆరోపిస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట కూడా ఇలాంటి ప్రమాదమే జరిగిందని అక్కడుండే ప్రజలు తెలియజేస్తున్నారు