తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తున్న షో ఏమిటంటే ఠక్కున బిగ్ బాస్ సీజన్ 2 అని చెప్పేస్తారు అందరు. అంతలా కాంట్రోవర్సీ గేమ్‌గా జనాల్లోకి వెళ్లిన ఈ గేమ్ షోలో కౌషల్‌ను టార్గెట్ చేస్తూ ఇంటి సభ్యులు చూపించిన విధానం అస్సలు బాగాలేదంటూ బయట కౌషల్ ఆర్మీ అంటూ ఒక ప్రత్యేక అభిమాన సంఘం కూడా ఏర్పడి ఈ షోకు అమాంతం హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇక ఈ షో గురించి సెలిబ్రిటీలు చాలా తక్కువగా మాట్లాడుతారు. కానీ ఎలాంటి విషయంపై ఐనా సరే కుండబద్దలు కొట్టేలా మాట్లాడతారు ప్రముఖ రచయిత కమ్ యాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ.
తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గేమ్ గురించి మాట్లాడారు. అసలు అదొక గేమ్ షోనా అంటూ ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కొన్ని విషయాలను ఆయన అసలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. బిగ్ బాస్ షోలో స్త్రీ పురుషుల మధ్య పోటీ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన చెప్పారు. ముఖ్యంగా కారు టాస్క్‌లో ఆడవారిని బలవంతంగా కారునుండి బయటకు గెంటేసిన విధానం అస్సలు బాగాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబం మొత్తం ఈ షో చూస్తుందని, అలాంటి సందర్భంలో ఇలాంటి పోటీలు పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ఆయన ప్రశ్నించాడు.
మొదటి సీజన్ సమయంలో కూడా బిగ్ బాస్ సమయంలో తన అభిప్రాయం చెప్పానని.. ఇప్పుడు కూడా ఈ షో చివరిదశకు చేరుకోవడంతో తన అభిప్రాయాన్ని చెప్పానని పరుచూరి అన్నారు. నాని హోస్టింగ్ బాగానే చేస్తున్నాడు ఆయన మెచ్చుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్ గేమ్ షోపై పరుచూరి ఆనందంగా లేరని తేలిపోయింది. మరి ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు, నాని ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.