నాగార్జున డౌన్ డౌన్… పరిస్థితి ఉద్రిక్తం

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కు రోజుకో కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. ఎన్నో వివాదాలకు కేరాఫ్గా ఉన్న బిగ్ బాస్ లాంటి కాంట్రవర్షియల్ షోకు నాగార్జున హోస్ట్ గా ఉండకూడదని… ఆయన ఈ షో నుంచి తప్పుకోవాలని… బిగ్ బాస్ ను ఆపేయాలని ఇప్పటికే డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శనివారం నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్థులు ముట్టడించారు.

ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో బిగ్ బాస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నాగార్జున డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పాటు… నాగార్జున బిగ్ బాస్ నుంచి వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆదివారం నుంచి షో ప్రారంభమవుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ షో నిర్వాహకులు తమను లైంగీకంగా వేధించారని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే బిగ్ బాస్ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ జేఏసీ ముందే హెచ్చరించింది. ఈ క్రమంలోనే శనివారం వీళ్లంతా నాగార్జున ఇంటి వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

చివరకు పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ షో పై ఓయూ విద్యార్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్ సి)లో ఫిర్యాదు చేశారు. ఏదేమైనా ఈ షోపై వరుసగా వస్తోన్న వివాదాల నేపథ్యంలో ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతోన్న నాగార్జున కూడా ఇప్పుడు ఈ షోను విమర్శించే వారికి టార్గెట్ అయ్యాడు.

Share.