ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కథానాయకుడు నేడు థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. తెలుగు జనాలకు అత్యంత ఇష్టమైన నందమూరి తారక రామారావు జీవితకథను ఆయన కుమారుడు బాలకృష్ణ తెరకెక్కిస్తుండటంతో నందమూరి అభిమానులతో పాటు ఇతరులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా భారీ తారాగణంతో వస్తున్న ఎన్టీఆర్ చిత్రం టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో ‘ఎన్టీఆర్’ సక్సెస్ అయ్యాడో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నందమూరి తారక రామారావు(బాలకృష్ణ) సినిమాల్లో నటించాలనే కోరికతో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కుటుంబ సభ్యులతో గొడవపడి మద్రాస్‌ వెళ్తాడు. ఆయను తన భార్య బసవతారకం(విద్యా బాలన్) ధైర్యం చెప్పి పంపిస్తుంది. కట్ చేస్తే.. సినిమాల్లో అవకాశం కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడతాడు. నెమ్మదిగా అవకాశాలు అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే హీరోగా ఎదుగుతాడు. అక్కినేని నాగేశ్వర రావు(సుమంత్)తో మంచి బంధం ఏర్పరుచుకన్న రామారావు రాయలసీమలో కరువుకు గురైన ప్రజలకు సహాయం చేయాలనుకుంటాడు. కట్ చేస్తే.. వరుసగా సినిమాలు చేస్తున్న రామారావు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు(రానా దగ్గుబాటి) రామారావుకు సహాయం చేస్తుంటాడు. క్లైమాక్స్‌ సీన్‌లో తెలుగు దేశం పార్టీని అనౌన్స్ చేస్తాడు రామారావు(బాలకృష్ణ).

విశ్లేషణ:
ఎన్టీఆర్ – కథానాయకుడు చిత్రం తెలుగు ప్రేక్షకులు నిజంగా ఒక మంచి అనుభూతిని మిగిలించిందని చెప్పాలి. తమ అభిమాన నటుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు బాలయ్య. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని జనాలకు మరింత చేరువ చేశాడు. బసవతారకంతో ఎన్టీఆర్ బంధం ఎలా ఉండేదో మనకు ఈ సినిమాలో చూపించాడు. ఫస్టాఫ్‌లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఎదురించి సినిమాల కోసం మాద్రాస్ రావడం.. ఆపై ఆయన ఎదుర్కొన్న సవాళ్లు.. వాటిని ఆయన అధిగమించిన తీరు మనకు చూపించారు. ఇక సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో రామారావు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో మనకు ఇందులో వివరంగా చూపించారు. ఇంటర్వెల్ సమయంలో రామారావు పెద్ద కొడుకు మరణంతో ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఏడ్పించాడు బాలయ్య.

సెకండాఫ్‌లో రామారావు హీరోగా సక్సెస్‌ అయిన విధానం మనకు చూపించాడు బాలయ్య. అటు వరుసగా సినిమాలు చేస్తూనే జనాలకు ఏదో చేయాలని మదనపడే రామారావు మనకు కనిపించాడు. అటు ఎన్టీఆర్-ఏఎన్నార్‌ల మధ్య బంధం కూడా మనకు ఇందులో చూపించారు. క్లైమాక్స్‌లో రామారావు ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తెలుగు దేశం పార్టీని స్థాపించడంతో సినిమాకు శుభం కార్డు పడింది.

ఓవరాల్‌గా రామారావు సినీ జీవితాన్ని మనముందు ఉంచారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్. రామారావు చేసిన విభిన్న పాత్రలను మరోసారి గుర్తుకు చేశాడు బాలయ్య. రామారావుగా బాలయ్య చేసిన పర్ఫార్మెన్స్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ గురించి తెలియని వారు కూడా ఈ సినిమాతో ఆయన గురించి పూర్తిగా తెలుసుకునేలా బాలయ్య చేశాడు.

నటీనటులు పర్ఫార్మె్న్స్:
ఎన్టీఆర్ చిత్రంలో మనకు బాలకృష్ణ ఎక్కడా కనిపించలేదు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కనిపించాడు. అంతలా తన తండ్రి పాత్రలో జీవించాడు బాలయ్య. ఎన్టీఆర్ హావభావాలను, బాడీ లాంగ్వేజ్‌ను అచ్చం అలాగే దించేశాడు బాలయ్య. మొత్తంగా నందమూరి అభిమానుల కోసం బాలయ్య చేసిన ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక బసవతారకం పాత్రలో విద్యా బాలన్ సూపర్‌గా నటించింది. బాలయ్యకు పర్ఫెక్ట్‌ జోడీగా నటించింది విద్యా. ఏఎన్నార్‌గా సుమంత్, చంద్రబాబుగా రానా, నాటి హీరోయిన్లుగా నేటి హీరోయిన్లు బాగా మెప్పించారు. ఎవ్వరూ తమ పాత్రలను తక్కువ కాకుండా చాలా పర్ఫెక్ట్‌గా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఎన్టీఆర్ సినిమా కోసం దర్శకుడు క్రిష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కడా చిన్న మైనస్ పాయింట్ కనిపించకుండా సినిమాను బాగా తెరకెక్కించాడు. బాలయ్యతో మంచి రిలేషన్ ఉన్న క్రిష్ ఎన్టీఆర్ చిత్రం కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దీంతో ఎన్టీఆర్ ఒక సినిమాలా కాకుండా ఒక జీవితంలా మనకు కనిపిస్తాడు. కీరవాణి సంగీతం సినిమాకు మరింత బలాన్ని అందించింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ప్రేక్షకులను కట్టిపడేసింది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉండటంతో సినిమా మొత్తం చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.

చివరిగా:
ఎన్టీఆర్ – సినిమా కాదు.. ఒక జీవితం!

రేటింగ్: 3.5/5

Share.