ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అమల్లో ఉన్న సూపర్ ఓవర్ నిబంధనలపై వస్తోన్న విమర్శల నేపథ్యంలో ఐసీసీ సరికొత్త నిబంధనలను తీసుకు వచ్చింది. సూపర్ ఓవర్‌పై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నిబంధనలు మార్చేందుకు ఎట్టకేలకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం రెండు జట్ల మధ్య స్కోర్ సమంగా వున్నప్పుడు సూపర్ ఓవర్ వేయిస్తారు.
సూపర్ ఓవర్ కూడా సమం అయితే అప్పుడు టోటల్‌గా మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు (ఫోర్లు + సిక్సర్లు) కొట్టిన టీంను విజేతగా నిర్ణయిస్తారు. ఇక ఈ యేడాది జరిగిన ప్రపంచకప్ ఫైనల్ కూడా ఇలాగే జరిగింది. ముందుగా 50 ఓవర్లలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య స్కోర్లు సమం కావడంతో అప్పుడు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో సైతం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో అప్పుడు
బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా నిర్ణయించారు.
ఇక ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ కూడా టై అవుతుంటే, ఫలితం వచ్చేంత వరకూ సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని ఐసీసీ స్పష్టం చేసింది. అంటే సూపర్ ఓవర్లు ఎన్ని సార్లు టై అయినా ఫలితం వచ్చే వరకు ఇవి ఆడిస్తూనే ఉంటారు. నాకౌట్ దశలో మాత్రమే ఆడిస్తున్న సూపర్ ఓవర్లు ఇకపై లీగ్ దశలోనూ ఉంటాయని చెప్పింది. ఇక జింబాబ్వే, నేపాల్ జట్లపై గతంలో విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్టు వెల్లడించింది.