కేరళ రాష్ట్రము ఇప్పుడిప్పుడే వరదల నుండి మెల్లగా కోలుకుంటుంది. ఊహించని వరదల వలన సుమారు రూ 20,000 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. కేంద్రం ఇప్పటికే రూ 600 కోట్ల సహాయం ప్రకటించింది. కానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్ కేంద్రాన్ని రూ 1500 కోట్ల సహాయం చేయాలనీ విన్నవించారు. దీని పై కేంద్రం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఈ రోజు కేరళ రాష్ట్రము తమిళ నాడు పై సుప్రీమ్ కోర్ట్ లో కేసు నమోదు చేసింది. వరదలకు అసలు కారణం తమిళ్ నాడు అని కేసు ఫైల్ చేసింది కేరళ ప్రభుత్వం. తమిళ నాడు ప్రభుత్వం ముళ్లపెరియర్ డ్యామ్ నుండి ఒక్కసారిగా నీటిని విడుదల చేయటం వలెనే ఈ నష్టం జరిగిందని, సుమారు 400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, కోట్లలో ఆర్ధిక నష్టం జరిగిందని కేసు ఫైల్ చేసారు.
తాము ఎన్నో సార్లు తమిళ నాడు ప్రభుత్వాన్ని ముళ్లపెరియర్ డ్యామ్ నుండి ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా నీటిని విడుదల చేయండని కోరగా వారు ఎప్పుడు సానుకూలంగా స్పందించలేదని..అంతే కాకుండా మొన్న ఒక్కసారిగా ఇడుక్కి రిసర్వాయర్ నీటిని విడుదల చేసే సరికి అవి వరదలకు దారి తీశాయి అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
కేరళ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ మేము మా నీటి వ్యవస్థని ప్రణాళికంగా రూపొందించామని, వరద నీటిని జాగ్రత్త గా సముద్రం వైపు మళ్లిస్తున్నామని, అయితే తమిళ నాడు ప్రభుత్వం ఊహించని విధంగా ఒక్కసారిగా ముళ్లపెరియర్ డ్యామ్ నుండి అధిక శాతం లో నీటిని విడుదల చేయటం తో మేము దిగువన ఉన్న ఇడుక్కి రిసర్వాయర్ నుండి మేము కూడా అధిక శాతం లో నీటిని విడుదల చేయవలసి వచ్చిందని. ఈ విధంగా ఈ భారీ నష్టం సంభవించిందని అఫిడవిట్ లో ప్రస్తావించారు కేరళ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ.