కళాతపస్వి కే విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తేదీన అనారోగ్య సమస్యలతో మరణించగా ఆయన మరణ వార్త మరువకముందే ఇప్పుడు ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూయడం అటు వారి కుటుంబ సభ్యులనే కాదు ఇటు సినీ ఇండస్ట్రీని కూడా కలచివేస్తోంది. ఈ మధ్యకాలంలోనే ఒకరి మరణం తర్వాత మరొకరి మరణం నిజంగా ఇండస్ట్రీని ఒంటరి చేస్తోందనడంలో సందేహం లేదు. ఒకవైపు కే విశ్వనాధ్ మరణం మరొకవైపు నందమూరి తారకరత్న మరణం ఇండస్ట్రీని పూర్తిగా కలచివేసింది.
ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ విషాదం మరింతగా అందరిని బాధిస్తోంది. ఆ విషాద వార్తలు మరువకముందే కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ స్వర్గస్తులయ్యారు. కే విశ్వనాథ్ మరణించినప్పటి నుంచే తీవ్ర అనారోగ్యానికి, మానసిక వేదనకు గురైన జయలక్ష్మి గత కొద్దిరోజులుగా మంచానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
అయితే అనారోగ్య పరిస్థితుల విషయమించడంతో ఈరోజు సాయంత్రం 6:15 నిమిషాల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కే విశ్వనాథ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ తండ్రి కే విశ్వనాథ్ కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా కన్నుమూయడం దురదృష్టకరమని వారు తమ ప్రకటనలలో వెల్లడించారు. ఆమె పార్థివ దేహాన్ని మరికొద్ది సేపట్లో ఫిలింనగర్ ప్రాంతంలో ఉన్న తమ నివాసానికి తరలించనున్నారు. రేపు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంతక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఆమెకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కే విశ్వనాథతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 88 సంవత్సరాలు భర్త మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె మంచానికే పరిమితమై ఇప్పుడు మరణించినట్లు తెలుస్తోంది.