ఇటీవల ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భద్రతాధికారి గా పనిచేస్తున్న లాన్స్ నాయక్ సాయి తేజ కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని ఎగువ రేగడ గ్రామానికి చెందిన వారు. ఇకపోతే ఈయన తెలుగువారు అని తెలియడంతో సామాన్యులు.. ప్రముఖులు కూడా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సినీ నటుడు అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి మంచు విష్ణు సాయి తేజ సతీమణి శ్యామల తో ఫోన్లో మాట్లాడారు.
మీ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. సాయి తేజ పిల్లలకు ఇంజనీరింగ్ వరకు చదువు చెప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు మంచు విష్ణు. సాయి తేజ కు 5 ఏళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండు సంవత్సరాల కుమార్తె దర్శిని ఉన్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనే ఉద్దేశంతోనే సాయి తేజ తన కుటుంబాన్ని మదనపల్లి కి మార్చారు. ఇకపోతే చిత్తూరు జిల్లాకు చెందిన మంచు విష్ణు కుటుంబానికి విద్యా నికేతన్ విద్యా సంస్థలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల ప్రతినిధులు విష్ణు సూచనమేరకు సాయి తేజ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఈ సందర్భంగా మంచు విష్ణు సాయి తేజ భార్యతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని , అండగా తాము ఉంటామని హామీ ఇచ్చారు.