సాధారణంగా కొంతమంది సెలబ్రిటీలు తమ చివరి కోరిక తీరకుండానే మరణిస్తూ ఉంటారు. సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించి.. సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చక్రి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చక్రి మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు పరిచయం చేసిన చక్రి 2014లో గుండెపోటుకు గురై మృతి చెందారు. వారి కుటుంబాన్నే కాదు యావత్ సంగీత ప్రపంచాన్ని జీర్ణించుకోలేకపోయేలా చేసింది. అయితే చక్రి మరణం తర్వాత వీరి కుటుంబంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి.
ఇక చక్రి వారసుడిగా ఆయన తమ్ముడు మహిత్ ఇండస్ట్రీలోకి సంగీత దర్శకుడిగా అడుగుపెట్టారు ఇలా కొన్ని సినిమాలకు సంగీతం అందించిన మహిత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన అన్నయ్య చక్రి గురించి మాట్లాడుతూ..” అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు.. అయితే అన్నయ్య మరణం తర్వాత ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి.. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నామని” మహిత్ వెల్లడించారు.
ప్రస్తుతం తాను ఒక స్టూడియో ఏర్పాటు చేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ స్టూడియో పెట్టడం అన్నయ్య చక్రి కల.. ఎప్పటికైనా ‘C’ స్టూడియో పెట్టాలని భావించారు. అయితే అది నెరవేరలేదు.. ఆయన చివరి కోరిక తీరకుండానే మరణించారు. కానీ ఆయన చివరి కోరికను నేను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. ‘ C’అంటే చక్రి కాదు చిరంజీవి అని అర్థం. అన్న చక్రికి చిరంజీవి గారంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య కోరిక మేరకే నేను నిర్మించిన స్టూడియోకి సి స్టూడియోస్ అనే పేరును పెట్టాను అంటూ మహిత్ తెలిపారు. అన్నయ్య చివరి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని.. కానీ అన్నయ్య లేని లోటు ఎప్పటికీ కృంగదీస్తుంది అంటూ మహిత్ తెలిపారు.