హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్.. అతిరథ మహారథులంతా క్యూకట్టినట్లుగా వస్తున్నారు.. ఒక్కొక్కరుగా వస్తుండగానే ఆ స్టార్ హోటల్ అతిథులతో సందడి అయింది.. ఆ సందడి చూస్తే అక్కడ ఏదో పెద్ద పార్టీ జరుగుతుందని అర్థమవుతుంది. కాకుంటే.. ఆ పార్టీ ఎవ్వరిస్తున్నారు.. ఎందుకిస్తున్నారు.. ఇంతకు ఆ పార్టీకి ముఖ్య అతిథులు ఎవ్వరు అనేది అక్కడ అక్కడ ఆసక్తిగా మారింది…
ఇంతలోనే పార్టీలో మెగాస్టార్ చిరంజీవి దర్శనమిచ్చారు.. వారి వెనుకాలే అతిథులుగా నటసింహం బాలయ్య, విక్టరీ వెంకటేశ్ వచ్చారు. అప్పుడు అందరికి అర్థమైంది.. ఓ ఇది మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ సక్సెస్ పార్టీ అని. ఆ పార్టీకి ముఖ్య అతిథులు బాలయ్య, వెంకటేశ్ అని. సైరా మూవీ సక్సెస్ మీట్‌ను స్టార్ హోటల్లో నిర్వహిస్తే ఆకాశంలో ఉండే తారలంతా ఆ స్టార్ హోటల్లో ప్రత్యక్షమయ్యారు..
సైరా నరసింహారెడ్డి చిత్రం ఈనెల 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. అయితే సినిమా విజయవంతం అయినందుకు సిని పరిశ్రమలోని అగ్రనటులు, దర్శకులు, పెద్దలకు మెగాపార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి వెంకటేశ్, బాలయ్యతో పాటుగా, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డి, తమన్నా, టి.సుబ్బిరామిరెడ్డి, మురళీమోహన్, అల్లు అరవింద్, శ్యాంప్రసాద్‌రెడ్డి, దిల్ రాజు, రఘురామకృష్ణం రాజు, రెబల్ స్టార్ కృష్ణంరాజు పాల్గొని సైరా టీంను అభినందించారు.