నటీనటులు : సుశాంత్, రుహాణి శర్మ, వెన్నెల కిశోర్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు : నాగార్జున అక్కినేని, జశ్వంత్ నడిపల్లి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫర్ : సుకుమార్. ఎం
ఎడిటర్ : చోటా కె ప్రసాద్
అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ కాలేకపోయాడు. సుశాంత్ తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అతడి కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఈ క్రమంలో మరో నటుడు రాహుల్ రవీంద్రన్ తొలిసారి దర్శకుడిగా మారి చేసిన చి||ల||సౌ|| సుశాంత్‌కు చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పొచ్చు. మరి ఈ సినిమా అయినా సుశాంత్ ఎదురుచూస్తున్న విజయాన్ని అందించిందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:
పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేని అర్జున్(సుశాంత్) తన ఇంట్లోవారి పోరు పడలేక పెళ్లిచూపులకు వెళతాడు. అక్కడ అంజలి(రుహాని శర్మ)ను పెళ్లిచూపులు చూస్తాడు. అంజలి కూడా తన అమ్మ బలవంతంపై పెళ్లి చూపులకు ఓకే అంటుంది. ఇలా పెళ్లిచూపుల్లో కలుసుకున్న అర్జున్, అంజలి ఒకరోజు గడపాల్సి వస్తుంది. మరి వీరిద్దరి పెళ్లిచూపుల తరువాత ఏం జరిగింది? అర్జున్,అంజలి పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.
విశ్లేషణ:
యాక్టర్ నుండి డైరెక్టర్‌గా మారిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన సినిమా కావడంతో చి||ల||సౌ|| మూవీపై జనాల్లో పెద్దగా అంచనాలు ఏమీ లేవు. అయితే సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్ వారికి కలుగుతుంది. ఒక చిన్న లైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా చేయడంతో చి||ల||సౌ|| అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడం ఖాయం.
చి||ల||సౌ|| చిత్రం ఫస్టాఫ్ మొత్తం కాస్త బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్‌లో ఆ ఫీలింగ్ ఎక్కడా కలగకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త సదరు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్‌తో పండించిన కామెడీ ఈ సినిమాకు పెద్ద బలం అని చెప్పాలి. కేవలం ఒకే రోజులో కథ నడుస్తుండటంతో ఎక్కడా కన్ఫ్యూజన్ రాకుండా చూపించిన విధానంతో డైరెక్టర్ భేష్ అనిపించుకున్నాడు. సినిమా మొత్తం మనం రోజు మాట్లాడుకునే మాటలతో ప్రేక్షకులను త్వరగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో సుశాంత్‌కు మంచి హిట్ బొమ్మ పడినట్లే అనుకోవాలి. అయితే ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తే మాత్రం కమర్షియల్ హిట్‌గా నిలుస్తోంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
హీరో సుశాంత్ ఇప్పటివరకు పెద్దగా నటించి మెప్పించిన చిత్రాలు ఏమీ లేవు. అయితే చి||ల||సౌ|| చిత్రం మాత్రం సుశాంత్‌లోని యాక్టింగ్‌ను పూర్తిగా చూపించింది. అన్ని ఎమోషన్స్‌ను బాగా పండించాడు ఈ హీరో. రుహాని శర్మ కూడా నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. వెన్నెల కిషోర్ మరోసారి తన కామెడీతో చిత్రానికి అదనపు బలం చేకూర్చాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేర బాగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
నటుడిగా మంచి గుర్తింపు సాధించిన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతుండటంతో అతడిలోని మరో ట్యాలెంట్‌ను ఈ సినిమాతో మనముందుకు తీసుకొచ్చాడు. డైరెక్షన్ అంటే ఆషామాషీ కాదని మనోడికి బాగా తెలిసినట్లుంది. అందుకే పక్కా ప్లానింగ్‌తో తాను ఏదైతే రాసుకున్నాడో దానినే తెరపై చూపించి మెప్పించాడు. దర్శకుడిగా తొలి చిత్రం రాహుల్ రవీంద్రన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ప్రశాంత్ విహారి అందించి సంగీతం వినసొంపుగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలో లీనమయ్యేలా చేసింది. సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరిగా: సుశాంత్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన చి||ల||సౌ||
రేటింగ్: 3.5/5