టీమిండియా జెర్సీ పై ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో జెర్సీ కలర్ మారడంపై చాలా వివాదాలే నడిచాయి. ఈ వివాదాలు కాసేపు పక్కన పెడితే తాజాగా ఇక నుంచి ఓ బ్రాండ్ పేరు కనుమరుగై అదే స్థానంలో మరో బ్రాండ్ పేరు కనిపించనుంది. ఇప్పటి వరకు టీం ఇండియా జెర్సీపై ఉన్న ప్రముఖ చైనీస్ మొబైల్ సంస్థ ఒప్పో బ్రాండ్ స్థానంలో ఇక నుంచి స్వదేశీ ఆన్ లైన్ ట్యుట్యోరింగ్ సంస్థ బైజూస్ పేరు కనిపించనుంది.
2017 మార్చిలో టీమిండియా జెర్సీపై బ్రాండ్ హక్కులను ఒప్పో సంస్థ రూ. 1,079 కోట్లకు దక్కించుకుంది. ఐదేళ్ల పాటు టీమిండియా జెర్సీపై ఒప్పో బ్రాండ్ కనిపించేలా ఒప్పందం చేసుకుంది. అంటే ఈ ఒప్పందం 2022 మార్చి వరకు ఉండనుంది. అంతకంటే ముందే ఒప్పో తన ఒప్పందం నుంచి వైదొలగింది. ఒప్పో నుంచి బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ ఈ హక్కులను సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ తో జరిగే టూర్ కు మాత్రమే ఒప్పో బ్రాండ్ టీమిండియా జెర్సీపై ఉంటుంది. ఒప్పో ఈ ఒప్పందం నుంచి విరమించుకోవడానికి ప్రధాన కారణం నష్టాల్లో ఉండడమే అని తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్ల హవా మొదలవడంతో ఒప్పో నష్టాల్లో ఉంది. అందుకే ఈ భారాన్ని మోయలేక తప్పుకుందట.
ఇక కొత్తగా ఎంట్రీ ఇస్తోన్న ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కూడా బీసీసీఐకి ఒప్పో చెల్లించినంత మొత్తాన్ని చెల్లించనుంది. ఎనిమిదేళ్ల క్రితం స్థాపించిన బైజూస్ కంపెనీ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. తెలుగులో మహేష్ బాబు, బాలీవుడ్ లో షారూక్ ఖాన్ వంటి అగ్ర నటులను బ్రాండ్ అంబాసిడర్ లు గా పెట్టుకుని దూసుకుపోతోంది.