ప్రముఖ నటుడు అరవింద్ స్వామి బొంబాయి, రోజా వంటి చిత్రాల్లో అద్భుతమైన తన నటనా ప్రదర్శన కనబర్చి ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసారు. తన అందంతో అమ్మాయిల మనసులను కొల్లగొట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ధ్రువ సినిమాలో విలన్ గా కనిపించి ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఆయన మరిన్ని ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు.
సెల్వ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న `వనంగముడి`లో అరవింద్ స్వామి విభిన్న అవతారాల్లో కనిపించనున్నారట. ఆయన ఏకంగా ఆరు ప్రత్యేకమైన గెటప్ లలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్లలో అరవింద్ స్వామి ని రకరకాల గెటప్పులో చూడొచ్చు. ఈ మూవీలో ఆయన అన్బజగన్ అనే పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఈ పోలీస్ అధికారి జీవితాన్ని వివిధ భాగాలుగా విభజించి చూపించారని సమాచారం. అయితే ప్రతి జీవిత భాగానికి తగ్గట్లుగా అరవింద్ స్వామి అనేక రూపాలతో కనిపించనున్నారు. ఈ పాత్ర చేసేందుకు ఆయన కఠినమైన శిక్షణ తీసుకుంటూ ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నారు. అయితే అతని మేకోవర్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం తెలుపుతోంది.