అరవింద సమేత వీరరాఘవ : రివ్యూ
నటీనటులు: ఎన్టీఆర్, పూజాహెగ్డే, జగపతిబాబు
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
టాలీవుడ్ లో మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ సినిమా కోసం తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసారు దర్శకులు త్రివిక్రమ్. మాటలనే ఆయుధాలుగా తయారు చేయడానికి ఒక కర్మాగారం అంటూ ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్. పదునైన కత్తుల్లాంటి డైలాగ్లను ఎన్టీఆర్ నోట వస్తే..ఆ కిక్కే వేరు. మరి వీరిద్దరూ కలిస్తే, రం రుధిరం.. సమరం.. శిశిరం.. అంటూ వెండితెరపై బీభత్సం సృష్టించబోతున్నారని ఫ్యాన్స్ టాక్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘అరవింద సమేత’ రివ్యూ మీకోసం..
కథ :
వీరరాఘవరెడ్డి (ఎన్టీఆర్) కొమ్మద్దికి చెందిన నారపరెడ్డి (నాగబాబు) కుమారుడు. ఇది నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. పక్క ఊరు నల్లగుడిలో బసిరెడ్డి (జగపతిబాబు) ఉంటాడు. అతని కుమారుడు బాలరెడ్డి (నవీన్ చంద్ర). వీరిమధ్య ఫ్యాక్షన్ గొడవలు సుమారు 30 ఏళ్ళ నుండి కొనసాగుతూనే ఉంటాయ్. ఈ ఫ్యాక్షన్ గొడవలో ఎంతో మంది అమాయకులు బలైపోతుంటారు…ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతుంటాయి..కానీ వారి అధినేతల్లో మాత్రం మార్పురాదు..పగలు ప్రతికారల కోసం ఎప్పుడూ వైరం పెట్టుకుంటూనే ఉంటారు. 12 ఏళ‍్ల పాటు లండన్లో ఉన్న నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్) ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. నాయనమ్మ(సుప్రియ పాతక్) మాటలకు ప్రభావితమై హింసకు, రక్తపాతానికి దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడ అరవింద (పూజాహెగ్డే) పరిచయం అవుతుంది. అరవింద కూడా తన నాయనమ్మ చెప్పినట్లు ‘హింస వద్దు.. రక్తపాతం వద్దు’ అని చెబుతుంటుంది. అరవిందకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంటాడు రాఘవ. ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? వాటిని ఎలా ఛేదిస్తాడు..అన్నది థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమా మొదటి నుంచి అంటున్నట్లు..ఫ్యాక్షన్ అంటే కేవలం చంపడం.. చంపుకోవడం కాదు.. దాన్ని మించిన ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఎన్టీఆర్ , త్రివిక్రమ్ చేసిన చిత్రమిది. ఆ అంచనాలకు తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ఓ పర్ఫెక్ట్ ప్యాకేజీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. ఎన్టీఆర్ అంటే అరుచుకునే డైలాగ్స్ కాకుండా.. ఆలోచింప చేసేలా డైలాగ్స్ రాశాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ అంటే డాన్స్ కాబట్టి రెడ్డి ఇక్కడ సూడు … పాటలో డాన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ పూజా హెగ్డే అరవింద అనే పాత్రలో ఒదిగిపోయింది. తమన్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్.
సంగీతంతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. . యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రపి సినిమాకు మరో ఎసెట్. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు వినోద్.
నటీనటులు పెర్ఫార్మన్స్ :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనపరిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చక్కగా నటించాడు. తండ్రి చనిపోయిన సీన్స్ లో పాటు.. విలన్స్ భరతం పట్టే సీన్స్ అయిన యాక్షన్ పార్ట్లో దుమ్మురేపాడు. హీరోని గొడవలు వైపు కాకుండా శాంతి వైపు వెళ్లేలా ఆలోచింపచేసే పాత్ర చాలా చక్కగా నటించి ఆకట్టుకుంది పూజ. గ్లామర్ తో పాటు నటనకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు త్రివిక్రమ్. మెయిన్ విలన్ బసిరెడ్డిగా నటించిన జగపతిబాబు లుక్, నటన ఆకట్టుకుంది. పగ కోసం కన్న కొడుకునే చంపుకునే తండ్రి పాత్రలో జగపతిబాబు మరోసారి మెప్పించాడు. ఒకదశలో జగపతి బాబును చూస్తుంటే ఒల్లు గగుర్బోడుస్తుంది. ఇక కమెడియన్గా నటించిన సునీల్ పాత్ర పరిమితమే, ఈషా రెబ్బా పాత్ర కూడా పెద్దగా చెప్పుకునేంత లేదు. పిసినారి సీనియర్ లాయర్గా సీనియర్ నరేవ్, అతని అసిస్టెంట్గా శ్రీనివాస రెడ్డి ఉన్నంతలో నవ్వించారు. ఇతర పాత్రల్లో సితార, దేవయాని, ఈశ్వరీ రావు, రావు రమేవ్, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ నటన పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..అందుకు తగ్గట్టుగానే దర్శకులు త్రివిక్రమ్… ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్స్, ఎమోషన్స్తో పాటు, ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకదశలో ఎన్టీఆర్ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. సంగీతం విషయానికి వస్తే థమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫి చాలా అద్భుతంగా చూపించాడు.. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు వినోద్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ : ఎన్టీఆర్, జగపతి బాబుల నటన, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైలాగులు
మైనస్ పాయింట్స్ : కొన్ని బోరింగ్ సీన్స్, ఈషా రెబ్బ క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ లేకపోవటం
బాటమ్ లైన్ : ఫ్యాక్షనిజానికి కొత్త అర్థం చెప్పిన ‘అరవిందుడు’
రేటింగ్ : 3/5