సినీ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎవరు పెద్ద అనే అంశంపై చాలాసార్లు చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఆ తరం హీరోల తర్వాత ఆస్థానాన్ని భర్తీ చేసే వారు ఎవరంటూ జరిగిన ఆసక్తికర చర్చల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్దగా ఉండి అన్ని విషయాలను ఆయన స్వయంగా చూసుకునేవారు. కానీ ఆయన మరణించిన తర్వాతే ఈ ప్రశ్న ఎదురయింది. దీంతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనే పేరు ఎక్కువగా వినిపించేది. కానీ తాను ఇండస్ట్రీ పెద్ద కాదని.. కేవలం నటుడిని మాత్రమేనని.. కళామతల్లి ముద్దుబిడ్డగా మాత్రమే తన బాధ్యతలను నెరవేరుస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
తాజాగా మరొకసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.. గురువారం హైదరాబాదు చిత్రపురి కాలనీ నూతన గృహ సముదాయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో ఇండస్ట్రీలో పెద్దరికంపై చిరంజీవి సంచలన కామెంట్లు చేయడం జరిగింది. హైదరాబాదులో సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీ ఎం ఐ జి, హెచ్ ఐ జి ప్లాట్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. దాదాపు 22 ఏళ్ల సినీ కార్మికుల కల ఇవాళ నిజమవడం గమనార్హం. దాంతో సినీ కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇకపోతే ఈ సామూహిక గృహప్రవేశాన్ని చిరంజీవి రిబ్బన్ కటింగ్ తో ప్రారంభించి మరొకసారి ఇండస్ట్రీలో పెద్ద ఎవరు అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ..” అనిల్ , దొరై ఎంతో కష్టపడి గృహ సముదాయాన్ని పూర్తి చేశారు. సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను.. ఎం. ప్రభాకర్ రెడ్డి దూర దృష్టి వల్లే కార్మికుల కల సహకారం అయింది. ఎంతో నీతి నిజాయితీతో వల్లభనేని అనిల్ కమిటీ గృహ సముదాయాన్ని పూర్తి చేసింది. నేను పెద్ద కాదు.. వాళ్ళు చిన్నవాళ్లుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద చేస్తున్నారు. నన్ను ఇండస్ట్రీలో అందరూ పెద్దోడు అంటున్నారు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజం కాస్థాను.. కానీ పెద్దరికం అనుభవించాలని లేదు.. నేను కోరుకున్న దాని కంటే దేవుడు నాకు ఎక్కువ ఇచ్చాడు” అంటూ చెప్పుకొచ్చారు.