హైదరాబాద్‌లో కామాంధు చేతుల్లో హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ దిశ నిందితులను నేటి తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం విదితమే. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు రంగాల్లో ప్రముఖులు అందరూ తమ సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియ జేస్తున్నారు. ఈ ఘటనపై సినీ నటులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేశ వ్యాప్తంగా మహిళలపై ఘాతుకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ దేవుడే పోలీసుల రూపంలో సరైన శిక్ష విధించారని అభిప్రాయపడ్డారు.
మరోసారి ఇలాంటి పనులు ఎవరూ చేయకుండా, అలాంటి ఆలోచన కూడా రాకుండా ఎన్‌కౌంటర్ ఒక గుణపాఠం అవ్వాలన్నారు. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందని బాలకృష్ణ తెలిపారు. అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. అందుకు ఇవాళ్టి ఎన్‌కౌంటరే ఉదాహరణ అని బోయపాటి శ్రీను తెలిపారు.