సంక్రాంతి బరి నుండి బంగార్రాజు అవుట్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట ఎవడో ఎనకటికి అన్నట్లుంది బంగార్రాజు పరిస్థితి చూస్తే. ఓవైపు మన్మథుడు 2తో బిజి, మరో వైపు బిగ్ బాస్ సీజన్ 3తో యమ బిజీ.. ఇట్లాంటి సమయంలో ఎక్కడ బంగార్రాజులో నటించేది, ఎప్పుడు నటించేది, సంక్రాంతికి విడుదల చేసేదెప్పుడు అనే పరిస్థితి ఇప్పుడు మన్మథుడు నాగార్జునది. అందుకే బంగార్రాజును సంక్రాంతి బరి నుంచి తప్పించేసి, ఎంచక్కా ఎండాకాలంలో పిల్లకాయలంతా సెలవుల్లో మునిగితేలుతున్నప్పుడు విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యాడట నాగార్జున.

అంటే సంక్రాంతి బరి నుంచి నటసామ్రాట్ అక్కినేని నాగార్జున తప్పుకున్నట్లే లెక్క. 2020 సంక్రాంతి బరిలో ప్రిన్స్ మహేష్బాబు, అల్లు అర్జున్, రజనీకాంత్ సినిమాలు బరిలో ఉన్నాయి. వీటికి తోడు నాగార్జున కూడా సంక్రాంతి బరిలో ఉంటున్నట్లు కర్చీఫ్ వేసాడు. కానీ అనుకోని విధంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. బిగ్బాస్ హోస్ట్ గా నాగార్జున ఎంపిక కావడంతో బంగార్రాజు భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటుగా ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, సీనియర్ నటీ రమ్యకృష్ణ కాంబీనేషన్లో దర్శకుడు కళ్యాణ్కృష్ణ రూపొందించనున్నాడు. అయితే సంక్రాంతికి విడుదల చేయాలనుకుని ప్లాన్ చేసుకున్నారు కాని ఇప్పటికి నాగార్జున మన్మథుడు 2లోనే నటిస్తున్నాడు. దీనికి తోడు బిగ్బాస్3లో యాంకరింగ్ చేస్తున్నాడు. నాగచైతన్య వెంకిమామతో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ములతో సినిమా ఉంది. అంటే ఇప్పుడు వీరిద్దరు యమ బిజిగా ఉన్నారు. అంటే బంగార్రాజు పట్టాలెక్కాలంటే మరో మూడు నెలలు ఆగక తప్పదు మరి.

Share.