‘కథానాయకుడు’ సెన్సార్ రిపోర్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి తారక రామారావు జీవితాన్ని ఎన్టీఆర్- కథానాయకుడు, మహానాయకుడు పేరిట రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తొలిభాగం కథానాయకుడు.. ఈనెల 9న విడుదల కాబోతోంది. ఈ చిత్రం సెన్సార్ శుక్రవారం నాడు జరిగింది. సెన్సార్ రిపోర్టు ప్రకారం ఎన్టీఆర్- కథానాయకుడు చిత్రం చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీ రామారావుగా ఆయన కొడుకు బాలకృష్ణ నటనకు కూడా విపరీతంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

తండ్రి పాత్రను తానే పోషిస్తూ ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించాలని బాలకృష్ణ చాలాకాలంనుంచి అనుకుంటున్నారు. సుదీర్ఘకాలం కాలం కసరత్తుల తర్వాత.. తొలుత తేజ దర్శకుడిగా ప్రాజెక్టు పట్టాలెక్కింది. మధ్యలో విభేదాలు రావడంతో తేజ తప్పుకున్నారు. తర్వాత జాగర్లమూడి క్రిష్ రంగ ప్రవేశం చేశారు. చిత్ర కథ ఎన్టీఆర్ జీవితమే అయినప్పటికీ.. దానికి సెల్యులాయిడ్ రూపం ఇవ్వడంలో క్రిష్ చాలా మార్పు చేర్పులు చేశారు. జీవితం నిడివి పెంచి, సినిమా జీవితం- రాజకీయ జీవితం అనే రెండు భాగాలుగా మలిచారు. సినిమా కేస్టింగ్ విషయంలో దర్శకుడు క్రిష్ చాలా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఒక్కొక్క పాత్రకు తగిన నటుల్ని ఎంచుకునే విషయంలో సుదీర్ఘమైన కసరత్తు చేశారు. కేవలం తెలుగు పరిశ్రమ నుంచి మాత్రమే కాకుండా, వివిధ భాషా చిత్ర పరిశ్రమల నుంచి అనేక మంది హీరో, హీరోయిన్లు, కేరక్టర్ నటుల పోర్ట్ ఫోలియోలను పరిశీలించి.. ప్రతిపాత్రకు దాదాపుగా సరిపోయే వారినే ఎంచుకున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ జీవితాన్ని ఒక సమగ్ర దృశ్య కావ్యంగా తీర్చిదిద్దడానికి ఆయన శ్రమించారు.

తొలిభాగం ‘కథానాయకుడు’ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం చాలా బాగున్నట్లు తెలుస్తోంది. చూసిన వాళ్లంతా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. సినిమాలో బాలకృష్ణ కూడా చాలా బాగా చేశాడని యూనిట్ సభ్యులు కూడా అంటున్నారు. దర్శకుడి పనిలో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా.. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అందువల్లనే.. దర్శకుడి దృక్పథానికి తగ్గట్లుగా చిత్రం చక్కగా రూపొందిందని తెలుస్తోంది.

Share.