యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయినా ఈ సినిమాను కష్టాలు వీడడం లేదు. ఇప్పటికే భారీగా నష్టపోవడంతో వాళ్లను ఆదుకునేందుకు సినిమాన నిర్మాతలు, ప్రభాస్ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తమను మోసం చేశారంటూ సాహో చిత్ర నిర్మాతలపై అవుట్ షైనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది.
హీరోయిన్ శ్రద్ధాకపూర్ తమ కంపెనీకి చెందిన బ్యాగ్ వాడేలా సినిమా మేకర్స్‌తో తాను ఒప్పందం కుదుర్చుకున్నామని.. అయితే సినిమాలో అసలు ఈ సీన్లే లేవని అర్కిటిక్ ఫాక్స్ లగేజ్ కంపెనీకి చెందిన మార్కెటింగ్ హెడ్ బి.విజయరావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సాహో నిర్మాతలు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి, హిమాక్ దువ్వూరు తమ కంపెనీకి చెందిన అర్కిటిక్ ఫాక్స్ లగేజ్ బ్యాగ్‌ను సాహో సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధ కపూర్ వాడేలా ఒప్పందం చేసుకున్నారన్నారట. అంటే కనీసం నాలుగైదు సీన్లలో హీరో, హీరోయిన్లలో ఎవరో ఒకరు ఈ బ్యాగ్ తగిలించుకోవాల్సి ఉంటుంది. అవి ప్రేక్షకులకు స్క్రీన్ మీద కనపడాలి.
ఇందుకు ఆ కంపెనీ వాళ్లు రు.37 లక్షలు చెల్లించగా.. మరో కోటి ఖర్చు పెట్టారట. అయితే ఒప్పందం ప్రకారం సినిమాలో ఆ బ్యాగ్ వాడలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారుల సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ప్లాప్ అయిన సాహో సినిమా అక్టోబర్ 19 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.