తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో సీహెచ్ విజయ రెడ్డి అనే తహసీల్దార్‌ను ఆమె కార్యాలయంలోనే సజీవ దహనం చేశారు. భూవివాదం నేపథ్యంలో సురేష్ అనే హంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తెలంగాణలోని రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లికి చెందిన కె.సురేశ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఆమెతో మాట్లాడేందుకు వెళ్లిన సురేష్ కొద్ది సేపటికే తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె సాయం కోసం ప్రాంగణంలోకి వచ్చి పడిపోయి అక్కడ విలవిల్లాడుతూ మృతి చెందింది.
విచిత్రం ఏంటంటే మంటలను ఆర్పడానికి అక్కడ సిబ్బంది పరుగులు తీశారు. అక్కడ ఉన్న సిబ్బంది మరో చోట భోజనం చేస్తున్నారు. మంటల్లో కాలుతున్నది ఎమ్మార్వో అని తొలుత గుర్తించక మేడమ్ ఎక్కడ? ఏం జరిగింది? అంటూ ఆమె కోసం వెతకగా ఆమె చేయి ఊపడంతో అప్పుడు గుర్తు పట్టారు. ఆ తర్వాత మంటలు ఆర్పేందుకు ఆమెపై దుప్పటి కప్పడం కనిపించింది. ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ ముఖమంతా కాలిపోయి ఏడుస్తున్న విజయారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కేవలం భూవివాదం నేపథ్యంలోనే సురేష్ ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. సురేశ్‌కు సంబంధించిన భూమిపై ఒక కేసు నడుస్తోందని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన వివరాలను సవరించే అంశంపైనే వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. హంతకుడు సురేష్ తండ్రి కృష్ణ.. పెదనాన్న దుర్గయ్యకు ఔటర్‌రింగ్ రోడ్డు దగ్గరలో ఏడెకరాల భూమి ఉంది. దీనిలో సురేష్ తండ్రిది రెండు ఎకరాలైతే.. పెదనాన్న దుర్గయ్యది మిగిలిన భూమి.
దీనిపై కన్నేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వత్తిడి తెచ్చి విక్రయించేలా రైతులతో ఒప్పందం చేసుకుంది. కొత్త పాసుపుస్తకాలు రాకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సాధ్యపడలేదు. భూమిపై కోర్టులో కేసు ఉందని, కోర్టు కేసు తేలే వరకు పాసు పుస్తకాలు జారీ చేసేది లేదంటూ రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తహశీల్దార్‌పై రైతులను ఉసిగొల్పినట్టు స్థానికులు చెబుతున్నారు.