నటి నుంచి రాజకీయనాయకురాలిగా టర్న్ అయిన రోజా…ఆ తర్వాత సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉంటూ.. మరోవైపు ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని నిర్వహిస్తూ బిజీ అయ్యింది. మరో వైపు బాలయ్య `రూలర్` సినిమా చిత్రకరణ పూర్తి చేసుకుని.. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటితో ఓ సినిమాని చేయనున్నారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ – రోజా కాంబినేషన్లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన సినిమాల్లో 90శాతానికి పైగా విజయం సాధించాయి.
ఈ నేపధ్యంలో ఆమెను తన సినిమాలో ఒప్పించటానికి బోయపాటి శ్రీను ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెగిటివ్ గా కనిపించే పాజిటివ్ పాత్ర అదని, ఇంట్రవెల్ వద్ద రివీల్ అయ్యే ఈ క్యారక్టర్ సెకండాఫ్ అంతటా ఉంటుందని సమాచారం. అయితే 2013 నుంచి రోజా బుల్లితెర ఓ కార్యక్రమానికి మాత్రమే జడ్జిగా వ్యవహరిస్తోంది. వెండితెరపై మాత్రం అడుగుపెట్టలేదు. మరి ఇప్పటికే బాలకృష్ణ, రోజా కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఈ జోడీ కలిసి స్క్రీన్ పై కనిపించింది లేదు.
ఇక మరోసారి ఈ ఇద్దరు సందడి చేయబోతున్నారనగానే అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. కానీ.. రోజా మాత్రం అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణపై డైరెక్ట్ అటాక్ చేసింది. అనేక రకాలుగా విమర్శలు గుప్పించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే హీరోగా నటిస్తున్న సినిమాలో అధికార పార్టీ ఎమ్మెల్యే విలన్ గా నటిస్తుందా? అవి పాత్రలుగానే తీసుకుని ఆమె చేస్తారా.. లేక నో అంటారో తెలియాలి. ఏదేమైనా అధికారిక ప్రకటన వస్తే కాని బాలయ్యతో ఎవరు పోటీ పడుతున్నారో తెలియదు.