రవితేజ నటించిన డాన్ శీను సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజనా సుఖానీ చాలా డిప్రెషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. కుటుంబంలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలతో తనకెంతో ఇష్టమైన సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని వాపోయిందంట. చాలా కాలం తర్వాత సుఖానీ ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. `మా ఆంటీ క్యాన్సర్ బారినపడ్డారు. ఆమెకు వివాహం కాకపోవడంతో నేనే అండగా ఉన్నాను. తనకు కీమో థెరపి జరిగిన సందర్భంలో నా బాధ వర్ణనాతీతం. తను చికిత్స తరువాత చనిపోయారు. ఈ బాధతోనే ఓ ఏడాది గడిచిపోయింది. నా జీవితంలో చాలా మార్పులు మొదలయ్యాయి.
ఆ తరువాత నన్నెంతగానో ప్రేమించే మా గ్రాండ్ మదర్ చనిపోయింది. దీంతో చాలా డిప్రెషన్ కు గురయ్యాను. దాని కారణంగానే సినిమాలకు దూరమయ్యాను“ అని చెప్పుకొచ్చింది అంజనా సుఖానీ. అయితే మళ్లీ షూటింగ్‌లకు వెళ్లాలనుకుంటున్నాను. మంచి పాత్ర దొరికితే తప్పక నటిస్తాను అంటూ దర్శక నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. ఇదిలా ఉండగా రవితేజ తొమ్మిదేళ్ల క్రితం నటించిన `డాన్ శీను` చిత్రంతో మంచి నటన ప్రదర్శించిన సుఖానీకి ఎందుకనో తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.
బాలీవుడ్ కి వెళ్లిన అంజన అల్లాబాందే- డిపార్ట్మెంట్- మాగ్జిమమ్- సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్స్టర్ రిటర్న్ వంటి చిత్రాలతో మంచి మార్కులే తన ఖాతాలో వేసుకుంది. అయితే 2017 నుంచి సినిమాలకు దూరమైపోయి ఇటీవల ప్రత్యక్ష మైంది. త్వరలో దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో పలు చిత్రాలను చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దక్షిణాది అంటే ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడానికే సుఖానీ ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆమె కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ల కోసం టెలివిజన్ ప్రకటనలో నటించారు. అలాగే ఘర్ జయేగి హిందీ రీమిక్స్ సాంగ్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2007 వచ్చిన మల్టీస్టారర్ సినిమా సలామ్-ఎ-ఇష్క్, సినిమాతో బాలీవుడ్ దర్శక నిర్మాతల చూపును తన వైపునకు తిప్పుకుంది. తరువాత 2006 హిట్ యొక్క సీక్వెల్ అయిన గోల్మాల్ రిటర్న్స్ లో నటించింది. ఇలా తెలుగు, తమిళం, మరాఠి చిత్రాల్లో కూడా నటించింది.