తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అభిమానుల గుస్సా షురూ అయింది. గత కొంత కాలంగా హీరోలు కలిసి మెలిసి ఉంటున్నారు. హీరోలు మేము గొప్ప.. అనే బేషజాలకు పోకుండా తోటి హీరోలతో కలిసి మెలిసి ఉంటున్నారు. ఒకరి సినిమాకు మరొకరు ప్రమోషన్ ఇస్తూ సినిమా హిట్ కోసం తమవంతు సహకారం అందించుకుంటున్నారు. అయితే హీరోలు ఎంత కలిసున్నా తమ సినిమాల విషయంలో మాత్రం ప్రమోషన్ చేసుకోవడంలో తమదైన శైలీలో ముందుకు పోతుంటారు. అయితే ఇప్పుడు హీరోలు కలిసి ఉన్నా అభిమానులు మాత్రం కలిసి ఉండటం లేదు. తమ హీరో గొప్పోడు అంటే తమ హీరో గొప్పోడు చెప్పుకుంటూ ఘర్షణలకు దిగుతున్నారు..
ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు ఇద్దరు అభిమానుల పుణ్యమా అని ఘర్షణ వాతావరణం నెలకొనేలా ఉంది. ఇద్దరు టాప్ హీరోలు ఒకే నెలలో.. ఒకే సమయంలో సినిమాలు విడుదల చేస్తుండటంతో ఇద్దరు హీరోల అభిమానులు యుద్ధం చేసుకునేలా కనిపిస్తుంది. అందుకు సంకేతాలు ఇస్తూనే ఉన్నారు ఈ అభిమానులు. ఇంతకు విషయం ఏంటంటే.. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్‌బాబు, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌లు నటించిన చిత్రాలు సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాల ప్రమోషన్ జోరుగా నడుస్తుంది. ఈ ప్రమోషన్లో ఇద్దరు హీరోల అభిమానులు చురుకుగా పాల్గొంటున్నారు.
ఇదే సందర్భంలో ప్రిన్స్, బన్నీ అభిమానులు కలహించుకుంటున్నారు. అలా వైకుంఠపురములో సినిమాకు గత రెండు నెలల ముందు నుంచే బన్నీ ప్రమోషన్ కార్యక్రమం షురూ చేసాడు. ఇప్పటికే అలా వైకుంఠపురములో సినిమా పాటలు సామజవరగమన, రాములో రాములో పాటలు ఇప్పుడు నెట్టింట్లో భారీగా ట్రెండింగ్ అవుతుంది. ఎక్కడ చూసినా బన్నీ పాటలతో దుమ్ము రేపుతున్నాయి. అయితే చిత్ర ప్రమోషన్ లో దూసుకుపోతున్న బన్నీ అభిమానులు ఖుషీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రిన్స్ మహేష్‌బాబు తన చిత్రం సరిలేరు నీకెవ్వరూ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సరిలేరూ నీకెవ్వరూ సినిమా టీజర్, ఫస్ట్‌లుక్‌లు విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక పాటను విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ పాట మైండ్ బ్లాంక్ మైండ్ బ్లాంక్. అ పాటను మహేష్‌బాబు అభిమానులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రిన్స్ పాటపై బన్నీ అభిమానులు నెగిటివ్ కామెంట్లు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మరో పసలేని పాటను ఇచ్చాడని, రొటీన్ మాస్ బీట్ తప్పితే ప్రత్యేకత ఏమీ లేదని బన్నీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నువ్వు కొట్టరా..నువ్వు ఊదరా,,నువ్వు వాయించరా అనే మాటలు తప్ప పాటేక్కడిది ఇందులో అని బన్నీ అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది సినిమా విడుదల సమయంలో ఎంతటి వివాదాలకు దారి తీస్తుందో అనే సందేహం కలుగుతుంది.