బాలకృష్ణ ” రూలర్ ” మూవీ రివ్యూ & రేటింగ్

0

సినిమా: రూలర్
న‌టీన‌టులు: బాల‌కృష్ణ‌, సోనాల్ చౌహాన్‌, వేదిక‌, భూమిక‌, ప్రకాష్‌రాజ్‌, జ‌య‌సుధ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: సీ.రాంప్రసాద్‌
మ్యూజిక్‌: చిరంత‌న్ భ‌ట్
నిర్మాత‌: సీ.క‌ళ్యాణ్‌
ద‌ర్శక‌త్వం: కేఎస్‌.ర‌వికుమార్
రిలీజ్ డేట్‌: 20 న‌వంబ‌ర్‌, 2019

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘రూలర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లతో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
వ్యాపారవేత్త అయిన సరోజినీ నాయుడు(జయసుధ)ను కాపాడిన వ్యక్తిని తన కొడుకు పేరు అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ) పేరుతో దత్తత తీసుకుంటుంది. తన బిజినెస్‌లను అర్జున్ ప్రసాద్‌కు అప్పగిస్తుంది. గతంలో సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్‌లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్‌ను ఓ మంత్రి బెదిరించడంతో మధ్యలోనే వదిలేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ దాన్ని మళ్లీ ప్రారంభించేందుకు యూపీ చేరుకుంటాడు. అతడిని చూసిన అక్కడి తెలుగు రైతులు ధర్మ వచ్చాడంటూ సంతోష పడతారు. ఇంతకీ ఈ ధర్మ ఎవరు..? అతడికి అర్జున్ ప్రసాద్‌కు సంబంధం ఏమిటి..? యూపీలో అసలు ఏం జరిగింది..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటిది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన రూలర్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ సినిమా కూడా మాస్ వర్గాలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించాడు దర్శకుడు కెఎస్ రవికుమార్. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే, ఫస్టాఫ్‌లో బిజినెస్‌వుమెన్ జయసుధను ఓ ప్రమాదం నుండి కాపాడిన బాలకృష్ణ గతం మరిచిపోవడంతో అతడిని తన కొడుకు పేరుతో దత్తత తీసుకుంటుంది. ఈ క్రమంలో జయసుధకు సంబంధించిన వ్యాపారాలను బాలయ్య చూసుకుంటాడు. మరో కంపెనీ ఓనర్ అయిన సోనాల్ చౌహాన్, స్టైలిష్ బాలయ్యకు ఫ్లాట్ అవుతుంది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమయాణం నడుస్తుంది. యూపీకి చేరుకున్న బాలయ్యకు అక్కడ అదిరిపోయే షాక్ ఎదురవుతుంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ధర్మ గురించి బాలయ్యకు తెలుస్తుంది. ఈ అదిరిపోయే ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

ఇక సెకండాఫ్‌లో ధర్మ పాత్రను చూపించాడు దర్శకుడు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య యాక్టింగ్ సూపర్. బాలయ్య చేసే యాక్షన్ సీన్స్‌కు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ రచ్చ చేస్తారు. కొన్ని బోరింగ్ సీన్స్ మధ్యలో వచ్చి సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. అయితే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో భారీ స్థాయిలో చూపించే అవకాశం ఉన్నా, దర్శుకుడు అంతంత మాత్రంగానే చూపించాడు. మొత్తానికి శుభం కార్డు పడేసరికి మాస్ ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సాహం తగ్గిపోతుంది.

ఓవరాల్‌గా చూస్తే రూలర్ సినిమాలో కథ కొత్తదే అయినా, రొటీన్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కెఎస్ రవికుమార్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇక బాలయ్య రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన మార్క్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. మొత్తానికి రూలర్ చిత్రం బాలయ్య ఫ్యాన్స్‌ మినహా మిగతావారికి అంతగా నచ్చకపోవచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అర్జున్ ప్రసాద్, ధర్మ పాత్రల్లో బాలయ్య యాక్టింగ్‌కు వంక పెట్టక్కర్లేదు. ఆయన తన ఎనర్జీతో సినిమాను తన భుజాలపై మోశాడు. బాలయ్య డ్యాన్సులతో మరోసారి మాస్ ఆడియెన్స్‌తో విజిల్స్ వేయించుకున్నాడు. ఇక హీరోయిన్లుగా సోనాల్ చౌహాన్, వేదికలు తమ పాత్రల మేర బాగా చేశారు. జయసుధ, ప్రకాష్ రాజ్, భూమిక తమ పాత్రలకు పూర్త న్యాయం చేశారు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు కెఎస్ రవికుమార్ ఎంచుకున్న కథ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా రొటీన్‌గా ఉంది. రెండు పాత్రల్లో హీరోను చూపించే ఫార్ములా పాతదే అయినా దాన్ని కథకు అనుగుణంగా మలుచుకుని ఉంటే ఇంకా బాగుండేది. కానీ రవికుమార్ స్క్రీన్‌ప్లేపై పట్టు వదులుకోవడంతో సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ చాలా చిరాకు తెప్పిస్తాయి. రాంప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. చిరంతన్ భట్ మ్యూజిక్ ఆక్టుకోలేకపోయింది. ఒక్క పాట కూడా బాగాలేకపోవడంతో తలలు పట్టుకున్నారు ఆడియెన్స్. సి.కళ్యాణ్ నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరగా:
రూలర్ – బాలయ్య కోసం చూడొచ్చు!

రేటింగ్:
3.25/5.0

Share.