రవితేజ ఖిలాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా: ఖిలాడి
నటీనటులు: రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, రావు రమేష్, అనసూయ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకుడు: రమేశ్ వర్మ

మాస్ రాజా రవితేజ గతేడాది క్రాక్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఆయన నుండి మరో సినిమా రావడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. ఇక గతంలో తాను నటించిన ‘వీర’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ వర్మకు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు ఈ మాస్ హీరో. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖిలాడి’చిత్రం టీజర్‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ప్రేక్షకుల్లో ఈ సినిమా పెద్దగా బజ్ క్రియేట్ చేయనప్పటికీ, ఈ సినిమాతో రవితేజ గ్యారెంటీ హిట్ కొడతాడని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఖిలాడి చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
సైకాలజీ స్టూడెంట్ అయిన పూజ(మీనాక్షి చౌదరి), ఓ థీసిస్ కోసం జైల్‌లో ఉన్న ఆడిటర్ గాంధీ(రవితేజ) గురించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో అతడి ఫ్లాష్‌బ్యాక్‌లో అనాధ అయిన గాంధీని ఆడిటింగ్ కంపెనీ ఓనర్ అయిన రాజశేఖర్(రావు రమేష్) పెంచుతాడు. తన ఎదురింట్లో ఉండే చిత్ర(డింపుల్ హయతి)ని ప్రేమిస్తాడు గాంధీ. ఈ క్రమంలో జరిగే భారీ మనీ లాండరింగ్ కేసులో రావు రమేష్ జైలుకు వెళ్తాడు. అతడికి సాయం చేసే క్రమంలో గాంధీ కూడా జైలు పాలవుతాడు. తన కుటుంబాన్ని హత్య చేసిన నేరంలో గాంధీ జైలుకెళ్తాడు. కట్ చేస్తే.. సీబీఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ కేసులో అసలు నిందితులు ఎవరు? మనీ లాండరింగ్ కేసులో రావు రమేష్ ఎందుకు ఇరుక్కుంటాడు? రవితేజ అసలు క్యారెక్టర్ ఏమిటి..? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఖిలాడి చిత్రాన్ని థియేటర్‌లో చూడాల్సిందే.

విశ్లేషణ:
మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ చిత్రంతో చాలా కాలం తరువాత ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కాడని అందరూ సంతోషించారు. అయితే ఈ సంతోషం కేవలం క్రాక్ చిత్రంతోనే ఆవిరయ్యేలా చేశాడు ఖిలాడి. దర్శకుడు రమేష్ వర్మతో మరోసారి సినిమా అనగానే రవితేజ అభిమానులు ఏదైతే జరగకూడదని అనుకున్నారో, అదే జరిగింది. ఖిలాడి వంటి పాత టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా కూడా ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా రవితేజ కెరీర్‌లో సక్సెస్‌కు బ్రేక్ వేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమా కథనం విషయంలో దర్శకుడు రమేష్ వర్మ దారుణంగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.

ఫస్టాఫ్‌లో హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ అతడి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌నే మనకు చూపించాడు ఈ డైరెక్టర్. ఇక కథలో భాగంగా ఫస్టాఫ్‌లో రవితేజ పాత్ర, అతడి లవ్ ట్రాక్‌ను చూపించారు. అటు తనను పెంచిన రావు రమేష్ ఓ సమస్యలో ఇరుక్కోవడంతో, ఆయన్ను బయటపడేసేందుకు రవితేజ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది మనకు చూపించారు. అయితే ఓ ఆసక్తికరమైన ట్వి్స్ట్‌తో రవితేజ కూడా జైలు పాలవుతాడు. ఇక్కడ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా సాదాసీదాగా ఉండటం ప్రేక్షకుల్లో సెకండాఫ్‌పై పెద్దగా క్యూరియాసిటీని క్రియేట్ చేయదు.

ఇక సెకండాఫ్‌లో సీబీఐ ఆఫీసర్‌గా అర్జున్ పర్ఫార్మెన్స్ కొంతమేర ఆకట్టుకుంటుంది. అయితే రవితేజను జైలు నుండి బయటకు తీసుకొచ్చేందుకు సాయం చేస్తుంది మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇక ఇక్కడి నుండి అసలు వేట మొదలుపెడతాడు మన హీరో. కట్ చేస్తే.. భారీ మనీ లాండరింగ్ కేసులో అసలు విలన్లు ఎవరు, వారిని రవితేజ ఎలా పట్టుకుంటాడనేది మనకు సెకండాఫ్‌లో చూపించారు. అయితే ప్రీక్లైమాక్స్‌లో రవితేజకు సంబంధించి వచ్చే ట్విస్ట్ బాగుంది. కానీ ఆ ట్విస్ట్ ఇచ్చిన కిక్‌ను క్లైమాక్స్‌ పూర్తిగా ఆవిరి చేస్తుంది. ఈ సినిమా ముగింపు చాలా రొటీన్‌గా ఉండటంతో సదరు ప్రేక్షకుడు పూర్తిగా నిరాశకు లోనవుతాడు.

ఓవరాల్‌గా చూస్తే.. క్రాక్ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కడిన రవితేజను మరోసారి సైడ్ ట్రాక్‌లోకి నెట్టేశాడు దర్శకుడు రమేష్ వర్మ. ఓ సాదాసీదా కథతో, కేవలం మాస్ ఎలివేషన్స్‌ను హైలైట్ చేస్తూ, కొన్ని లిప్ లాక్ సీన్స్, యాక్షన్ సీన్స్‌తో సినిమాను నెట్టుకు వద్దామని చూసిన ఈ డైరెక్టర్ సినిమాను ఎంగేజింగ్‌గా పెట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మొత్తానికి రవితేజ ఖిలాడి ప్రేక్షకులను అలరించడంలో బొక్కబోర్లా పడ్డాడని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఖిలాడి చిత్రంలో రవితేజ పర్ఫార్మె్న్స్ పరంగా ఎలాంటి మైనస్ పాయింట్స్ లేవు. ఆయన ఎప్పటిలాగే ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కథనం బలహీనంగా ఉన్నా కూడా తన యాక్షన్‌తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడంలో రవితేజ సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్లుగా నటించిన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలకు మంచి పాత్రలు పడ్డాయని చెప్పాలి. ముఖ్యంగా మీనాక్షి చౌదరి నటన ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. అటు డింపుల్ హయతి అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీబీఐ ఆఫీసర్ పాత్రలో అర్జున్ నటన బాగుంది. రావురమేష్, అనసూయల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా వారు తమ పాత్రల మేర బాగానే చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రమేష్ వర్మ గతంలో రవితేజతో చేసిన ‘వీర’ సినిమా ఎఫెక్ట్‌ను మరోసారి రిపీట్ చేశాడు. ఖిలాడి అనే టైటిల్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసినా కూడా కథనంలో పస లేకపోవడం, సినిమాను ఎంగేజింగ్‌గా తరకెక్కించడంలో ఈ దర్శకుడి పనితనం పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. నటీనటులను పూర్తిగా వాడుకోవడంలోనూ ఈ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. అయితే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
ఖిలాడి – మళ్లీ దెబ్బేశాడురోయ్!

రేటింగ్:
2.25/5.0

Share.