” వెంకీ మామ ” మూవీ రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా: వెంకీ మామ
దర్శకుడు: కెఎస్ రవీంద్ర(బాబీ)
మ్యూజిక్: థమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాతలు: సురేష్ బాబు, టిజి విశ్వప్రసాద్, వివేక్ కుచ్చిబోట్ల
నటీనటులు: వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్, తదితరులు

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం ‘వెంకీ మామ’ మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పాటు చేసింది. కుటుంబ సమేత చిత్రంగా వెంకీ మామ తెరకెక్కినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. భారీ ప్రమోషన్స్‌తో నేడు విక్టరీ వెంకటేష్ 59వ పుట్టినరోజు సందర్భంగా వెంకీ మామ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
వెంకటరత్నం నాయుడు(వెంకటేష్) తన గ్రామంలో మంచి పేరున్న వ్యక్తిగా ఉంటారు. తన తండ్రికి(నాజర్) జాతకాలపై ఎక్కువ నమ్మకం ఉండటంతో వెంకటరత్నం మేనల్లుడు కార్తీక్‌ది(నాగ చైతన్య) శ్రీకృష్ణ జాతకం కావడంతో అతడి మేనమామకు కీడు జరుగుతుందని భావించిన వెంకటరత్నం తండ్రి అతడంటే ఇష్టపడడు. కానీ వెంకీ మామ మాత్రం తన మేనల్లుడిని అల్లారుముద్దుగా పెంచుతాడు. కట్ చేస్తే.. కొన్ని కారణాల వల్ల కార్తీక్ తన మేనమామ నుండి దూరంగా వెళ్లిపోతాడు. తన మేనల్లుడిని ఎలాగైనా తన దగ్గరకు తెచ్చుకోవాలి వెంకీ మామ ప్రయత్నిస్తాడు. అయితే కార్తీక్ తన మేనమామ నుండి దూరంగా ఎందుకు వెళ్లిపోతాడు? వెంకీ మామ తన మేనల్లుడిని కనుక్కుంటాడా లేడా అనేది సినిమా కథ.

విశ్లేషణ:
నిజజీవితంలో మామా అల్లుళ్లయిన వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుండీ అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా దర్శకుడు బాబీ ఈ సినిమాను ఇంకాస్త బాగా తెరకెక్కించే అవకాశం ఉన్నా అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోయాడు. ఫస్టాఫ్‌లో వెంకీ-చైతూల మధ్య నడిచే ఎమోషన్ బాండింగ్‌ను, కామెడీని మనకు బాగా చూపించాడు దర్శకుడు.

నిజజీవితంలో మామ అల్లుళ్లు అయిన వెంకీ-చైతూలు తమ పాత్రల్లో పూర్తిగా లీనమై నటించారు. ఇక కార్తీక్ పాత్రలో చైతూ రొమాంటిక్ యాంగిల్ చాలా బాగుంది. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్టుతో ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్‌ బ్యాంగ్ ప్రేక్షకుల్లో సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తాయి.

సెకండాఫ్‌లో తన మేనల్లుడిని వెతికే వెంకీ ఆరాటం చాలా బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో వెంకీ నటన సూపర్. తన అల్లుడు తనను విడిచి ఎందుకు వెళ్లాడా అని వెంకీ తెలుసుకునే క్రమంలో అతడికి షాకింగ్ నిజం తెలుస్తోంది. మరి తన మేనల్లుడిని వెంకటేష్ ఎలా తన దగ్గరకు తీసుకువచ్చాడు అనేది సినిమా క్లైమాక్స్‌ అంశంగా నిలుస్తుంది. మొత్తానికి రియల్ ఎమోషనల్ బాండ్‌ను రీల్‌లోనూ అంతే స్థాయిలో చూపించారు వెంకీ మామ చైతూ అల్లుడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
వెంకీ మామ పాత్రకూ పూర్తి న్యాయం చేయగల హీరోగా వెంకటేష్ మరోసారి సినిమాను తన భుజాలపై మోశాడు. వెంకీ మామ పాత్రలో వెంకీని తప్ప మరే ఇతర హీరోను మనం ఊహించుకోలేని పరిస్థితిని క్రియేట్ చేశాడు. అటు అల్లుడు కార్తీక్ పాత్రలో చైతూ యాక్టింగ్ కూడా సూపర్. మామకు తగ్గ అల్లుడు అనే పాత్రలో చైతూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక హీరోయిన్లుగా రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు బాబీ మంచి సబ్జెక్ట్‌ను ఎన్నుకున్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కాస్త పాతదిగా ఉంది. మామాఅల్లుళ్ల దగ్గర నుండి తాను చాలా పర్ఫార్మెన్స్ రాబట్టుకునే అవకాశం ఉన్నా, దాన్ని పూర్తిస్థాయిలో బాబీ వినియోగించుకోలేదు. స్క్రీన్‌ప్లే కూడా సినిమాకు మైనస్ పాయింట్. సినిమాటోగ్రఫీ బాగుంది. కాశ్మీర్ సీన్స్ చాలా బాగా చూపించారు. థమన్ సంగీతం బాగుంది. బీజీఎం‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరగా:
వెంకీ మామ – కాంబినేషన్ కుదిరింది.. కథ దెబ్బేసింది!

రేటింగ్:
3.0/5.0

Share.