డియర్ కామ్రేడ్ రివ్యూ

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ టైమింగ్ గేమ్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దూసుకెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం, ట్యాక్సీవాలా లాంటి విజయవంతమైన సినిమాలతో స్టార్ డం ను సొంతం చేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు కలిసి నటించిన గీతగోవిందం సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ కొనసాగింపులోనే తాజాగా.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ మరోసారి తనదైన మార్క్ నటనతో కట్టిపడేశాడు. విద్యార్థిగా.. అందులోనూ విప్లవభావాలున్న విద్యార్థిగా, ప్రేమికుడిగా.. ప్రేమకు దూరమై బాధపడుతున్న యువకుడిగా.. ఆయన నటన అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు. బాబీలో ఎక్కువగా అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుంది.. అంటే అగ్రెస్సివ్ మూడ్ లో..! అలాగే.. హీరోయిన్ రష్మిక మందన్న కూడా తనపాత్రకు న్యాయం చేసింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు.. ఎమోషనల్ సీన్స్ లోను మెప్పించింది. ముఖ్యంగా వీరిద్దరి కెమెస్ట్రీయే సినిమాకు ప్రధాన బలం కావడం గమనార్హం. ఇక జస్టిన్ ప్రభాకర్ అందించిన సంగీతం.. సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. దర్శకత్వ లోపాలను సంగీతం కనిపించనివ్వదు. అంతలా మెప్పించాడు జస్టిన్ ప్రభాకర్.

కథ..
కథ విషయానికి వద్దాం.. బాబీ(విజయ్ దేవరకొండ) కాకినాడలోని ఓ కాలేజీ స్టూడెంట్. రాడికల్ ఐడియాలజీ(విప్లవభావాలు) ఉన్న వ్యక్తి. ఎప్పుడూ కోపంగా ఉంటాడు. ఈ క్రమంలో ఇతరులతో తరుచూ గొడవపడుతూ ఉంటాడు. లిల్లీ( రష్మిక మందన్న) మంచి క్రికెట్ ప్లేయర్. స్టేట్ లెవల్లో ఆడుతుంది. అయితే.. ఓ సారి కజిన్ పెళ్లి కోసం కాకినాడుకు వస్తుంది. ఈ క్రమంలో బాబీ, లిల్లీల మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? లిల్లీ ప్రేమ పొందడానికి బాబీ ఎం చేశాడు..? ఆ తర్వాత వారిద్దరు ఎందుకు విడిపోయారు?  దీనికి కారణం ఎవరు..?  తదితర ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమాకు వెళ్లాల్సిందే మరి. 

విశ్లేషణ..
దర్శకుడు భరత్ కమ్మ ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు పెద్దలోపంగా కనిపిస్తుంది. అలాగే.. తాను అనుకున్న కథను అనుకున్నట్టు చూపించడంలో కూడా ఆయనకొంత ఇబ్బందిపడినట్లు అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం కూడా కాలేజీ, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్యసాగే ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలతో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కానీ.. రెండో భాగంలో మాత్రం అంతే ఇంట్రెస్టింగ్గా కథను నడిపించడంలో దర్శకుడు విఫలం అయ్యారు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండడం కూడా మైనస్ గా అనిపిస్తుంది. అయితే.. రియలిస్టిక్ సీన్స్, లోకేషన్స్, ఎమోషనల్ సీన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

రేటింగ్ : 2.75/5

Share.